
గాయాలతో దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నారు. అక్కడ గాయాల నుంచి కోలుకోవడానికి ఫిజియోథెరపీల సమక్షంలో శిక్షణ పొందనున్నారు. ప్రస్తుతం బెంగళూరు క్రికెట్ అకాడమీ హెడ్‌గా హైదరాబాద్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ ఉన్న సంగతి తెలిసిందే. కోలుకునే వరకు అక్కడే ఉండనున్నారు. రోహిత్ శర్మ కోలుకోవడానికి 3 నుంచి 4 వారాల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కాగా రవీంద్ర జడేజా కోలుకోవడనాకి నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.
అయితే వీరిద్దరు వీలైనంత త్వరగా కోలుకోవడానికి ఫిజియోథెరపీలు పూర్తి సహకారం అందిస్తున్నారని సమాచారం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రోహిత్, జడేజా ఇప్పట్లో కోలుకోరని తెలుస్తోంది. ఎందుకంటే వీరి గాయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని సమాచారం. కాకపోతే రోహిత్ శర్మ మాత్రం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నాటికి అందుబాటులో ఉంటాడని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
సౌతాఫ్రికా పర్యటనకు సన్నాహకాల్లో భాగంగా బౌన్సర్ బంతులను ఎదుర్కోవడం ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. అతడి తొడ కండరాలు పట్టేశాయి. అయితే ఈ సమస్య రోహిత్‌కు గతంలో కూడా ఉంది. అదే గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో హిట్‌మ్యాన్ సఫారీలలో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా రోహిత్‌కు ఇటీవల వన్డే కెప్టెన్సీతోపాటు టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కిన సంగతి తెలిసిందే. ఇటు వన్డే కెప్టెన్‌గా, అటు టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా రోహిత్ దక్షిణాఫ్రికాలో తొలి సవాల్ ఎదుర్కొవల్సి ఉంది.
అయితే ఈ సమయంలో రోహిత్ గాయంతో టెస్ట్ సిరీస్‌కు దూరమవడంతో అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు టీమిండియాకు కూడా టెస్ట్ సిరీస్‌లో రోహిత్ లేని లోటు ఉండనుంది. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై రోహిత్ శర్మ అద్బుతంగా రాణించి టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరీస్‌లోను రోహిత్ శర్మ కీలకపాత్ర పోషిస్తాడని అంతా భావించారు. కానీ అతని తొడ కండరాల గాయం మళ్లీ తిరగబెట్టడం కొంపముంచింది. మరోవైపు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా సౌతాఫ్రికా పర్యటనకు దూరమవడం పెద్ద సమస్యగా మారింది.
టీ20 వరల్డ్‌కప్ తర్వాత గాయపడిన జడేజా న్యూజిలాండ్‌తో సిరీస్‌తో పాటు సౌతాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. జడేజా కోలుకోవడానికి మరికొన్ని నెలల సమయం పట్టేలా ఉంది. దీంతో అతను మరిన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. కాగా ఇటీవల జడేజా ఆల్‌రౌండర్‌గా అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సౌతాఫ్రికా పర్యటనలో జడేజా, రోహిత్ లేని లోటు భారత జట్టులో స్పష్టం కనిపించనుంది.