
హైదరాబాద్: నవంబర్ 13 భారత క్రికెట్ అభిమానులు మరిచిపోలేని రోజు. ఎందుకంటే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సరిగ్గా మూడేళ్ల క్రితం శ్రీలంకపై సంచలన ఇన్నింగ్స్ ఆడింది ఈరోజే కాబట్టి. 2014, నవంబర్ 13వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. దాదాపు 225 నిమిషాల పాటు క్రీజులో ఉన్న రోహిత్ శర్మ బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
రోహిత్ శర్మ నమోదు చేసిన 264 పరుగులే వన్డేల్లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా 153 పరుగుల తేడాతో ఘన విజయం గెలిచింది. అంతేకాదు వన్డేల్లో రెండు సార్లు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు కూడా రోహిత్ శర్మనే కావడం విశేషం.
2013లో నవంబర్ 2వ తేదీన బెంగళూరులో ఆసీస్‌తో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ(209) తొలి డబుల్ సెంచరీ చేశాడు. భారత్ తరపున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మతో పాటు వీరేంద్ర సెహ్వాగ్ (219), సచిన్ టెండూల్కర్ (200 నాటౌట్)లు కూడా ఉన్నారు.