
హైదరాబాద్: శ్రీలంకతో టెస్టు, వన్డే సిరిస్ ముగిసింది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయికి చేరువయ్యాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 1500 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 15 పరుగుల దూరంలో ఉన్నాడు.
ఇప్పటివరకు భారత్ తరుపున 60 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 129.92 స్ట్రయిక్ రేటుతో 1485 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ గనుక టీ20ల్లో 1500 పరుగులు చేస్తే కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ అవుతాడు.
విరాట్ కోహ్లీ 55 టీ20లాడి 137.84 స్ట్రయిక్ రేటుతో 1956 పరుగులు సాధించాడు. టీ20ల్లో కోహ్లీ అత్యధిక వ్యక్తిగత సోరు 90 నాటౌట్‌గా ఉంది. వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్న 'హిట్‌మ్యాన్' పొట్టి ఫార్మాట్‌లోనూ చెలరేగుతాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే భారత్-శ్రీలంక జట్ల మధ్య కటక్‌లోని బరాబతి స్టేడియంలో బుధవారం రాత్రి తొలి టీ20 జరగనున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకతో తలపడనుంది. తొలి టీ20కి ముందు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.
కాగా, ఇదే స్టేడియంలో అక్టోబర్ 5, 2015లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 92 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలి టీ20 కోసం రూపొందించిన పిచ్ బ్యాట్స్ మెన్లకు అనూకూలమని అంటున్నారు. దీంతో వన్డేల సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్ సేన టీ20ల్లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.