
టెస్టుల్లో నెంబర్ వన్ జట్టు ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఈ విజయం అనంతరం తన కెప్టెన్సీ గురించి రోహిత్ శర్మ మాట్లాడాడు. టెస్టుల్లో భారత బౌలింగ్ విభాగాన్ని విరాట్ కోహ్లీ అద్భుతంగా మేనేజ్ చేసే వాడని, అది చూసి తాను చాలా నేర్చుకున్నానని చెప్పాడు. పిచ్ అనుకూలంగా ఉన్నా కూడా వెంటనే మనకు కావలసిన ఫలితాలు రావని, ప్రత్యర్థి బ్యాటర్లపై నిరంతరం ఒత్తిడి పెడితేనే అది సాధ్యమని వివరించాడు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతను, బౌలర్లు అదే పని చేసేవాళ్లని చెప్పిన రోహిత్.. ఇప్పుడు తాను కూడా అదే చెయ్యడానికి ప్రయత్నిస్తున్నా అన్నాడు.
'పరిస్థితులు మాకు మాత్రమే కాదు, రెండు జట్లకు ఒకేలా ఉంటాయి. పిచ్ నుంచి మనకు కావలసిన ఫలితాలు రాబట్టుకోవడం బౌలర్లను చాలా స్పెషల్ చేస్తుంది. ఇలాంటి పిచ్‌లపై ఏం చెయ్యాలో, ఎక్కడ బాల్స్ వెయ్యాలో వాళ్లకు చాలా బాగా తెలుసు. అలా చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ ఉంటారు' అని చెప్పుకొచ్చాడు.
'నేను ఆటగాడిగా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడే ఒక విషయం గమనించా.. వికెట్లు దక్కినా దక్కకపోయినా ప్రత్యర్థిపై ఒత్తిడి మాత్రం కచ్చితంగా ఉండేది. సరైన ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్‌తో ఒత్తిడి పెట్టడంతో ప్రత్యర్థులు పొరపాటు చేసే అవకాశం పెరుగుతుంది. విరాట్ కెప్టెన్సీలో వీళ్లు బౌలింగ్ చేయడం చూసి నేను అదే నేర్చుకున్నా' అని రోహిత్ వెల్లడించాడు.
'అప్పుడు నేర్చుకున్న దాన్నే ఇప్పుడు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నా. పిచ్ చూసి మరీ ఎగ్జయిట్ అవ్వకూడదు. ప్రతి బంతికీ వికెట్లు రావు కదా. అలా జరిగితే ఇంకేం ఉండదు. అంత ఈజీగా వికెట్లు రావని మాకు మేమే గుర్తుచేసుకుంటూ ఉండాలి. కష్టపడటం ఆపకూడదు' అని పేర్కొన్నాడు. తొలి టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన రోహిత్ సేన.. ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టులో కూడా ఆస్ట్రేలియాను ఓడించాలని ఉవ్విళ్లూరుతోంది.