
అబుదాబి: నాకౌట్ రేసులో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ విజృంభించిన విషయం తెలిసిందే. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి కృషితో సూపర్-12లో భాగంగా బుధవారం రాత్రి అబుదాబి వేదికగా జరిగిన పోరులో భారత్ 66 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదురవడంతో డీలాపడ్డ కోహ్లీసేనకు ఈ విజయం కాస్త ఊరటనివ్వగా.. పండుగపూట అభిమానుల మోమొల్లో నవ్వుల కాంతులు పూయించింది. ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచిన కోహ్లీసేన రన్‌రేట్‌ను మెరుగు పర్చుకొని గ్రూప్-2లో నాలుగోస్థానానికి ఎగబాకింది.
అయితే ఈ మ్యాచులో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సృష్టించారు. బుధవారం అఫ్గానిస్థాన్‌తో తలపడిన మ్యాచులో రోహిత్, రాహుల్ తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బలమైన పునాది వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ తరఫున అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం (140) రికార్డు ఖాతాలో వేసుకున్నారు. ఈ ఘనత సాధించిన రెండో భారత ఓపెనింగ్ జంటగా నిలిచారు. అంతకుముందు 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్.. ఇంగ్లండ్‌పై 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (47 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్ పంత్ (13 బంతుల్లో 27; ఒక ఫోర్, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అఫ్గాన్ బౌలర్లలో నైబ్, కరీం చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ మహమ్మద్ నబీ (35), కరీం జనత్ (42 నాటౌట్) పోరాడారు. రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. శుక్రవారం జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో భారత్ తలపడనుంది.
టీ20ల్లో అత్యధిక శతక భాగస్వామ్యాలు:
5 సార్లు : బాబర్ అజామ్ - మహ్మద్ రిజ్వాన్
4 సార్లు: శిఖర్ ధావన్ - రోహిత్ శర్మ
4 సార్లు: మార్టిన్ గప్తిల్ - కేన్ విలియమ్సన్
4 సార్లు: కేఎల్ రాహుల్ - రోహిత్ శర్మ