
హైదరాబాద్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ మూడు వన్డేల సిరిస్ వచ్చే వరల్డ్ కప్‌కు సన్నాహకంగా ఉంటుందని ఓపెనర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
2019లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఈ వన్డే సిరీస్ ద్వారా అధిగమించి వరల్డ్ కప్‌కు సన్నద్ధమవుతామని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు.
"ఇంగ్లండ్ పటిష్టమైన జట్టు. ఆ జట్టుతో వారి గడ్డపై ఆడటం ద్వారా కొన్ని సవాళ్లను అధిగమించడంతో పాటు అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌కు మేము ఆడబోతున్న వన్డే సిరీస్ సన్నాహకం వంటిది" అని రోహిత్ శర్మ అన్నాడు.
"ఇంగ్లాండ్ జట్టు మమ్మల్ని ఎంతవరకూ ఒత్తిడిలోకి నెడుతుందో చూడాలి. దాన్ని అధిగమించడానికి టీమిండియా సిద్ధంగా ఉంది. ఇంగ్లాండ్‌పై సిరీస్‌ను గెలవడం మాకు అత్యంత ముఖ్యం. మా బలాబలాల్ని అర్థం చేసుకుని రాణించడానికి ప్రస్తుత సిరీస్ లాభిస్తుందనే అనుకుంటున్నా" అని అన్నాడు.
"మేము సమష్టిగా రాణిస్తే ఇంగ్లాండ్‌ను ఓడించడం కష్టం కాదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో టాస్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. అదే సమయంలో ఇంగ్లీష్ జట్టు నిర్దేశించే లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం" అని రోహిత్ శర్మ తెలిపాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే నాటింగ్‌హామ్ వేదికగా జరగనుంది.