అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ మజానిచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో పరుగులు వరద పారిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్‌లో ఇరు జట్ల స్కోరు సమం కావడంతో, ఫలితం కోసం మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. మొత్తంగా టీమిండియా విజయం సాధించింది.
అయితే రెండో సూపర్ ఓవర్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు రావడం నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వచ్చాయి. తొలి సూపర్ ఓవర్ ఆఖరి బంతి ముందు హిట్ మ్యాన్ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే రెండో సూపర్ ఓవర్‌లో కూడా రోహిత్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు. దీన్ని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో పాటు పలు విశ్లేషకులు తప్పుబట్టారు. తాజాగా అఫ్గానిస్థాన్ బౌలర్ కరీమ్ జనత్ దీనిపై స్పందించాడు.

''రోహిత్ శర్మ తిరిగి బ్యాటింగ్‌కు రావడం గురించి మా మేనేజ్మెంట్ అంపైర్లతో మాట్లాడింది. అయితే రూల్స్ ప్రకారం అతడు బ్యాటింగ్ చేయడానికి వీళ్లేదని తర్వాత తెలిసింది. రిటైర్డ్ ఔట్‌గా వెళ్లినా రోహిత్ తిరిగి బ్యాటింగ్‌కు రాకూడదు. అయితే జరిగిపోయిన దాన్ని గురించి ఇప్పుడు మాట్లాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.ఈ విషయం గురించి కెప్టెన్, కోచ్ తర్వాత మాట్లాడుకున్నారు'' అని కరీమ్ జనత్ అన్నాడు. మ్యాచ్ మధ్యలో అఫ్గాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీపై రోహిత్ కోపంతో అరవడంపై కరీమ్ మాట్లాడాడు.
తొలి సూపర్ ఓవర్‌లో మహమ్మద్ నబీ, రోహిత్ శర్మ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ వేసిన చివరి బంతిని ఆడటంలో నబీ విఫలమయ్యాడు.వెంటనే అతను క్విక్ సింగిల్‌కు ప్రయత్నించగా.. వికెట్ కీపర్ సంజూ శాంసన్ రనౌట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ శాంసన్ వేసిన బాల్ నబీ ప్యాడ్స్‌ను తాకి లాంగాన్‌లో ఉన్న విరాట్ కోహ్లీ వైపు దూసుకెళ్లింది. దాంతో నబీ మరో రెండు పరుగులు పరుగెత్తాడు.
''రోహిత్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఒక బ్యాటర్ పరిగెత్తుతుంటే వెనుక నుండి ఎవరైనా త్రో విసిరితే.. బంతి ఎక్కడ నుంచి వస్తుందని అతడికెలా తెలుస్తుంది? అయితే తొలి టీ20లో కూడా గిల్ విషయంలో ఇలానే జరిగింది. గిల్ బ్యాట్‌కు బాల్ తగలడంతో అయిదు పరుగులు వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్‌ది తప్పు కాదు'' అని కరీమ్ జనత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడు ఐఎల్ టీ20లో గల్ఫ్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు.