
ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. అతని బామ్మర్ది పెళ్లి ఉండటంతో రోహిత్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. రోహిత్ గైర్హాజరీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ (Rohit Sharma) తన భార్యతో కలిసి బామ్మర్ది పెళ్లిలో తెగ సందడి చేస్తున్నాడు. అతను ఈ వేడుకల్లో హుషారుగా డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రోహిత్ తన భార్య రితికతో కలిసి వేదికపై చిందులు వేశాడు. రితిక సోదరుడు కునాల్ సజ్దే వివాహం ఉండటంతో రోహిత్.. తొలి వన్డేకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే కునాల్ (Kunal Sajdeh) పెళ్లిలో తెగ చిందులు వేశాడు. ఈ భార్యాభర్తలు డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 'హిట్‌మ్యాన్ తన మూవ్స్ చూపిస్తున్నాడు' అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరొకరేమో 'ఇక్కడ కూడా రోహిత్ ఫుట్‌వర్క్ చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంది. లెగ్‌సైడ్ చాలా డామినెంట్‌గా ఉంది. చేతులు బాడీకి దగ్గరగా ఉన్నా బాగానే ఉంది. సంగీత్ డ్యాన్సింగ్‌పై ఇదొక మాస్టర్ క్లాస్' అంటూ జోక్ చేశాడు.
ఆసీస్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో రోహిత్ బాగానే రాణించాడు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నాడు. మిగతా మ్యాచుల్లో భారీ స్కోర్లు చేయకపోయినా కూడా ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. క్రీజులో ఉన్నంతసేపూ భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టులో కూడా అతను భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అనవసర షాట్‌కు ప్రయత్నించిన అతను పెవిలియన్ చేరాడు. లేదంటే ఈ మ్యాచ్‌లో కూడా మంచి టచ్‌లో కనిపించిన అతను భారీ ఇన్నింగ్స్ ఆడేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.