
హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం సఫారీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-2తో చేజార్చుకున్నా... ఆ తర్వాత జరిగిన ఆరు వన్డేల సిరిస్‌ను 5-1తో కైవసం చేసుకుని సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించింది.
ఆ తర్వాత ప్రారంభమైన మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20కి కాస్తంత విరామం లభించడంతో జట్టులోని ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను వదిలి సరదాగా తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లి సేదతీరుతున్నారు.
ఆటగాళ్లు వరుసగా మ్యాచ్‌లు ఆడుతుంటే వాళ్లపై ఒత్తిడి పెరుగుతుందని గతంలో కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ బహిరంగంగానే వెల్లడించిన సంగతి తెలిసిందే. సిరిస్ మధ్యలో దొరికిన విరామ సమయాన్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత మైదానంలోకి వస్తే మెరుగైన ప్రదర్శన చేస్తారని కూడా చెప్పారు.
కోచ్, కెప్టెన్ చెప్పిన మాటలు జట్టులోని ఆటగాళ్లకు బాగా వంటపట్టినట్లు ఉన్నాయోమో తెలియదు గానీ ప్రాక్టీస్ మానేసి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం రెండో టీ20 మ్యాచ్‌కు ముందు మంగళవారం టీమిండియా ఆప్షనల్ ట్రెయినింగ్ సెషన్‌లో పాల్గొనాల్సి ఉంది.
అయితే జట్టులోని ఆటగాళ్లంతా దీని డుమ్మా కొట్టి సమీపంలోని తమకు నచ్చిన ప్రదేశాలను చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్, చైనామన్ స్పిన్నర్ చాహల్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కలిసి గోల్ఫ్ క్లబ్‌లో సరదాగా గోల్ఫ్ ఆడారు.
ఈ విషయాన్ని రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాగా, మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 బుధవారం రాత్రి 9.30 గంటలకు సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరగనుంది.