
హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్ ఓ సరదా ట్వీట్ చేశాడు. దిగ్గజ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్‌తో కలిసి దిగిన ఫొటోను అతడు ట్విటర్‌లో పోస్టు చేశాడు. అయితే ఇందులో విశేషం ఏముంది? అని మీరు అనుకోవచ్చు.
అయితే ఈ ఫొటో కింద అతడు పెట్టిన 'ముగ్గురు గొప్ప ఓపెనర్లు' అనే కామెంట్ మాత్రం నెటిజన్లను నవ్వులు పూయించింది. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు ప్రపంచంలోని అత్యుత్తుమ ఓపెనర్లు. అలాంటి వారితో భారత్ తరుపున పెద్దగా క్రికెట్ ఆడనటువంటి రోహాన్ గవాస్కర్ ఈ ట్వీట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.
'సచిన్, రోహన్ గవాస్కర్, సెహ్వాగ్.. భారత్‌కు చెందిన అతి గొప్ప ఓపెనర్లు. ఇద్దరు క్రికెట్‌లో.. మరొకరు బాటిల్ ఓపెన్ చేయడంలో' అని తన మీదే సెటైర్ వేసుకున్నాడు. వీరంతా కూడా టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేల విందు కార్యక్రమంలో కలిశారు.
ఈ విందు కార్యక్రమాన్ని జహీర్-సాగరికల జోడీ పెళ్లి అనంతరం ముంబైలోని తాజ్‌లో ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన రోహన్ వారిద్దరితో ఫోటో దిగి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. కాగా, సచిన్‌తో తాను బ్లాక్ అండ్ వైట్‌లో దిగిన ఫొటోను పోస్టు చేసిన సెహ్వాగ్... 'మేమిప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి ఆటగాళ్లం. సచిన్‌ను కలవడం ఎప్పుడూ అద్భుతమే' అని అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.