హైదరాబాద్: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నీలో అరుదైన రికార్డుని సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఏడుసార్లు చాంపియన్ ఫెడరర్ 7-6 (7/3), 6-4, 6-4తో 27వ సీడ్ మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు.
దీంతో అత్యధికంగా 317 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో గెలిచిన ప్లేయర్‌గా ఫెదరర్ అరుదైన గుర్తింపు పొందాడు. తాజా విజయంతో అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ (316) రికార్డుని బద్దలు కొట్టాడు. వింబుల్డన్ టోర్నీలో వరుసగా 19వ ఏడాది ఆడుతోన్న ఫెదరర్ ఈ టోర్నీలో మొత్తం 98 సింగిల్స్ మ్యాచ్‌లు ఆడి 87 విజయాలు సాధించాడు.
అత్యధిక సింగిల్స్ మ్యాచ్‌లు గెలిచిన క్రీడాకారుల జాబితాలో నవ్రతిలోవా (306) మూడో స్థానంలో, క్రిస్ ఎవర్ట్ (299) నాలుగో స్థానంలో ఉన్నారు. పురుషుల విభాగంలో ఫెదరర్ తర్వాత జకోవిచ్ (236) రెండో స్థానంలో ఉన్నాడు. జిమ్మీ కానర్స్ (233), అండ్రీ అగస్సీ (225), ఇవాన్ లెండిల్ (222), రఫెల్ నాదల్ (217) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అంతేకాకుండా 15వసారి ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. ఆదివారం వింబుల్డన్‌కు సెలవు. దీంతో సోమవారం పురుషుల, మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ జరగనున్నాయి. ఫెదరర్ ప్రిక్వార్టర్స్‌లో సోమవారం దిమిత్రోవ్ (బల్గేరియా)తో తలపడనున్నాడు.
ముఖాముఖి రికార్డులో ఫెదరర్ 5-0తో ఆధిక్యంలో ఉన్నాడు.మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా మూడో రౌండ్లో అడుగుపెట్టింది. సానియా, ఇవాన్ దోడిగ్ (క్రొయేషియా) జంట రెండో రౌండ్లో 7-6 (5), 6-2తో యుసుకె వతానుకి-మకోటో నినోమియా (జపాన్) జోడీపై విజయం సాధించింది.