WTC Final:'భారత బౌలింగ్ చూసి నేను ఆశ్చర్యపోయా..చాలా దారుణంగా ఉంది!కివీస్ బౌలర్లు ఎలా చేశారో చూడలేదా?'

ముంబై: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియా బౌలింగ్ చేసిన విధానం సరిగ్గా లేదని, చాలా దారుణంగా ఉందని మాజీ పేసర్ రోజర్ బిన్నీ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌లో బౌలింగ్ చేసే పద్ధతి ఇది కాదని భారత బౌలర్లపై మండిపడ్డారు. అసలు ఇదేం ప్రదర్శన, న్యూజిలాండ్ బౌలర్లు ఎలా బౌలింగ్ చేశారో చూడలేదా? అని బిన్నీ ప్రశ్నించారు. ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీసేనపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్‌లో కివీస్ అదరగొడితే.. భారత్ మాత్రం చేతులెత్తేసి భారీ మూల్యం చెల్లించుకుంది.

చాలా దారుణంగా ఉంది:
తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మాజీ పేసర్ అయిన రోజర్ బిన్నీ భారత బౌలర్లపై మండిపడ్డాడు. 'బౌలింగ్ చేసేటప్పుడు బంతులు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాలి. ఇంగ్లండ్‌లో బౌలింగ్ చేయడం ఇలా కాదు. భారత బౌలర్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. కివీస్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌కు ఎలా బౌలింగ్ చేశారు?.. భారత్ ఎలా వేసింది. ఇక్కడ ఆడేది టెస్టు క్రికెట్. ఎవరైనా బౌలింగ్ చేసేటప్పుడు బ్యాట్స్‌మెన్‌కు దగ్గరగా బంతి పిచ్ అవ్వాలి. అంతేకానీ బౌలర్ల వైపు పిచ్ అవ్వకూడదు. వాళ్లు షాట్లు ఆడాలి. మీరెంత షార్ట్‌పిచ్ బంతులేస్తే బంతి అంత అధికంగా సీమ్ అవుతుంది' అని బిన్నీ అన్నారు.

నేను ఆశ్చర్యపోయా:
'బంతి నేరుగా వికెట్లకేసి విసరాలి. అంతేకానీ ప్రత్యర్థులకు అనుకూలంగా వేయొద్దు. కానీ భారత బౌలర్లు కివీస్ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవాలని మాత్రమే చూశారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. భారత బౌలర్లు చేయాల్సింది ఏమిటంటే.. ప్రత్యర్థులు ఎలా బౌలింగ్ చేస్తున్నారో గమనించాలి. అలాగే బ్యాట్స్‌మెన్‌కు బంతులేయాలి. టీమిండియా బౌలర్లు కొత్తవాళ్లు కాదు. మన బ్యాట్స్‌మెన్ ఆడుతుంటే కివీస్ బౌలర్లు ఎలా బంతులేశారో చూసి నేర్చుకోవాలి' అని రోజర్ బిన్నీ సూచించారు. బిన్నీ భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 47, వన్డేల్లో 77 వికెట్లు పడగొట్టారు.

ఒక్క వికెట్ కూడా తీయలేదు:
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతో భారత్ ఫైనల్లో బరిలోకి దిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. 36.4 ఓవర్లు వేసి 92 రన్స్ ఇచ్చాడు. దీంతో భారత్ ఓటమికి పరోక్షంగా కారకుడయ్యాడు. మరోవైపు షమీ, అశ్విన్ నాలుగేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ మూడు, జడేజా ఒక వికెట్ తీశారు. ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ నేపథ్యంలోనే భారత బౌలర్ల వైఫల్యంపై మాజీ పేసర్ రోజర్ బిన్నీ మండిపడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications