ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లకు సంబంధించి మోసం చేశారన్న ఆరోపణలపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు.తనపై అరెస్ట్ వారెంట్ జారీ అవడంపై కూడా అయన వివరణ ఇచ్చారు. "నాపై పీఎఫ్ కేసుకు సంబంధించిన ఇటీవలి వార్తల నేపథ్యంలో నా ప్రమేయం గురించి నేను కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాను" అని ఉతప్ప చెప్పారు. స్ట్రాబెర్రీ లెన్సేరియా ప్రైవేట్ లిమిటెడ్, సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెర్రిజ్ ఫ్యాషన్ హౌస్‌తో తన పాత్ర ఏమిటో ఉతప్ప వివరించాడు.
2018-19లో తాను ఈ కంపెనీలకు రుణాల రూపంలో ఆర్థిక సహకారం అందించినందున తనను కంపెనీ డైరెక్టర్‌గా నియమించారని తెలిపారు. అయితే తను చురుకైన కార్యనిర్వాహక పాత్ర పోషించలేదని చెప్పాడు. అలాగే తాను రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనలేదని పేర్కొన్నాడు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా, టీవీ ప్రెజెంటర్‌గా, వ్యాఖ్యాతగా తనకు బజీ షెడ్యూల్ ఉందని.. కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి తకు సమయం లేదా నైపుణ్యం లేదని చెప్పాడు. కంపెనీలో లోన్ల రూపంలో పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు.

"దురదృష్టవశాత్తూ ఈ కంపెనీలు నేను అప్పుగా ఇచ్చిన నిధులను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాయి. నేను చాలా సంవత్సరాల క్రితం నా డైరెక్టర్‌షిప్‌లకు కూడా రాజీనామా చేశాను. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రావిడెంట్ ఫండ్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పుడు, నా న్యాయ బృందం ప్రతిస్పందిస్తూ, ఈ కంపెనీలలో నాకు ఎలాంటి పాత్ర లేదని హైలైట్ చేస్తూ, నా ప్రమేయం లేదని నిర్ధారిస్తూ కంపెనీల నుండే డాక్యుమెంటేషన్ అందించారు" అని ఉతప్ప చెప్పాడు.
తను ఇతర సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టినట్లు వివరించాడు. ఎక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ పదవులు నిర్వర్తించలేదని పేర్కొన్నారు. పీఎఫ్ నిధుల దుర్వినియోగంలో తన ప్రమేయం లేదని ఉతప్ప చెప్పాడు. త్వరలో ఈ సమస్యను అధిగమిస్తానని తెలిపాడు. ఆలోగా నిజాలను తెలుసుకొని మాత్రమే సమాచారం ఇవ్వాలని మీడియాకు విజ్ఞప్తి చేశాడు. బకాయిలు రూ. 23,36,602 (సుమారు $28,500 USD) చెల్లించాలని ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ షడక్షర గోపాల రెడ్డి ఉతప్పను ఆదేశించారు.