శ్రీశాంత్ ఆ క్యాచ్ పడతాడనుకోలేదు.. రాసిపెట్టి ఉండటం వల్లే అలా: ఉతప్ప

ఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా పేసర్ ఎస్ శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌ను సగటు క్రికెట్ అభిమాని మరచిపోలేడు. ఇక భారత అభిమానులు అయితే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఎందుకంటే.. ఆ ఒక్క క్యాచ్ ఏకంగా టీ20 ప్రపంచకప్‌ను తెచ్చిపెట్టింది. పాకిస్థాన్‌తో తలపడిన తుదిపోరులో మిస్బాఉల్ హక్ (43) చివరి వరకూ బ్యాటింగ్ చేసి ఆ జట్టును గెలిపించినంత పనిచేశాడు. జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవర్‌లో మూడో బంతికి భారీ షాట్ ఆడి.. బౌండరీ వద్ద శ్రీశాంత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ పొట్టి క్రికెట్‌లో తొలి ఛాంపియన్‌గా నిలిచింది.

భారత జట్టు గెలవాలని దేవుడికి మొక్కా:
చివరి ఓవర్‌లో శ్రీశాంత్.. మిస్బాఉల్ హక్ క్యాచ్ పడతాడనుకోలేదని టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. రాసిపెట్టి ఉండటం వల్లే ఆ ప్రపంచకప్ గెలిచామని, తాను అదే నమ్ముతానన్నాడు. ఉతప్ప ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నాటి ఉత్కంఠ పోరులో తానెలా భావోద్వేగం చెందాడో వివరించాడు. పాక్ బ్యాటింగ్ చేస్తుండగా 15వ ఓవర్ నుంచే తాను ప్రతీ బంతికి భారత జట్టు గెలవాలని దేవుడికి మొక్కానని ఉతప్ప అన్నాడు. అలాగే శ్రీశాంత్‌పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మా ఆటగాళ్లకు ధైర్యం చెప్పా:
'అది ఫైనల్ ఓవర్. జోగిందర్ శర్మ బౌలింగ్ చేసేటప్పుడు నేను లాంగ్ ఆన్‌లో ఉన్నా. తొలి బంతి వైడ్‌గా వెళ్లడంతో ఎంతో నిరాశా చెందా. తర్వాతి బంతి సిక్స్ వెళ్లకుండా ఉంటే చాలనుకున్నా. నేను ఏదైతే కోరుకున్నానో అదే జరిగింది. ఆ బంతి సిక్స్ పడింది. అయినా అప్పటికీ భారత్ గెలుస్తుందనే ఆశలు ఉన్నాయి. మరోవైపు పాకిస్థాన్ కూడా విజయానికి చేరువైంది. అయితే చేతిలో వాళ్లకు ఒకే వికెట్ ఉండడంతో కొంచెం దైర్యంగా అనిపించింది. ఆ సమయంలోనూ మా ఆటగాళ్లకు ధైర్యం చెప్పా' అని రాబిన్ ఉతప్ప తెలిపాడు.

రాసిపెట్టి ఉండటం వల్లే:
'పాక్ గెలవాలంటే ఇక 4 బంతుల్లో 6 పరుగులు కావాలి. మూడో బంతికి మిస్బా స్కూప్ షాట్ ఆడాడు. అది అమాంతం గాల్లోకి వెళ్లడం చూసి అక్కడ ఎవరు ఫీల్డింగ్ చేస్తున్నారని గమనించా. శ్రీశాంత్ కనపడ్డాడు. అప్పటికి అతనంటే క్యాచ్‌లు వదిలేశేవాడని జట్టులో గుర్తింపు ఉంది. శ్రీశాంత్ తేలిక క్యాచ్‌లను కూడా వదిలేస్తాడు. చాలాసార్లు చూశాను. ఈ ఒక్క క్యాచ్ పట్టేలా చూడు దేవుడా అని ప్రార్థించా. బంతి అతడి చేతుల్లో పడింది. ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నా. అతను పట్టిన క్యాచ్‌ను మీరు గమనిస్తే.. బంతి చేతుల్లో పడ్డాక కూడా గాల్లోకే చూస్తుంటాడు. కాబట్టి నేనైతే మాకు రాసిపెట్టి ఉండటం వల్లే గెలిచామని భావిస్తా' అని ఉతప్ప పేర్కొన్నాడు.

ఎలాంటి అంచనాల్లేకుండా:
ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ (75) టాప్ స్కోరర్. అనంతరం పాక్ 19.3 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అదే ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. దాంతో ఎలాంటి అంచనాల్లేకుండా టీ20 ప్రపంచకప్‌కు వెళ్లిన భారత యువ జట్టు.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications