
జింబాబ్వేతో శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ సునాయస విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆతిథ్య జింబాబ్వే జట్టుపై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. సిరీస్ ఇప్పటికే చేజిక్కడంతో.. బెంచ్ ప్లేయర్లకు అవకాశాలు కల్పించేందుకు భారత జట్టు ప్లాన్స్ వేస్తుంది. దీంతో సిరీస్ ముగింపు మ్యాచ్ సందర్భంగా చాలా మార్పులు జరిగే వీలుంది. ఇకపోతే జట్టులో మార్పుల విషయమై భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు. ఆఖరి వన్డేకు ముందు భారత జట్టు ఎంపికలో పలు కీలక విషయాలను సూచించాడు.
ఐపీఎల్ 2022లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన రాహుల్ త్రిపాఠిని తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడం పట్ల ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే రుతురాజ్ గైక్వాడ్ సైతం వన్డేలలో అరంగేట్రం చేయాల్సి ఉన్న మరో బ్యాటర్. వీరిద్దరికి చివరి మ్యాచ్‌లోనైనా అవకాశం దక్కాలని ఉతప్ప పేర్కొన్నాడు.
'బ్యాటింగ్ విషయానికి వస్తే.. మేనేజ్ మెంట్ చివరి వన్డేలో ఎలాంటి మార్పులు చేస్తుందో నాకైతే తెలియదు. షాబాజ్ అహ్మద్ తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి కొంతకాలంగా బెంచ్ మీదే ఉన్నారు. వారికి చివరి వన్డేలో కూడా ఛాన్స్ రాకపోతే అది అన్యాయమే అవుతుంది. అయితే ఇప్పటికే తుది జట్టులో ఉన్న ఇషాన్ కిషన్ కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే బ్యాటింగ్ చేశాడు. కాబట్టి అతన్ని తీసేయడం కూడా సబబు కాదు. కాబట్టి తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయో అనే విషయం చాలా కష్టం.. ఏదేమైనా వారిద్దరికీ అవకాశాలిస్తే బాగుండు' అని ఉతప్ప సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో చెప్పినట్లు తెలిసింది.
తొలి రెండు గేమ్‌లలో ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లకు జట్టు మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వొచ్చని ఉతప్ప పేర్కొన్నాడు. ఆఖరి గేమ్‌కి మళ్లీ దీపక్ చాహర్ తిరిగి వస్తాడని.. అవేష్ ఖాన్ కూడా అతనికి తోడుగా ఆడతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. శార్దూల్ ఆడొచ్చని చెప్పాడు. అందరూ ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌గా ఉండేలా ఫాస్ట్ బౌలర్లను రొటేషన్ పాలసీలో ఆడించాలని నిర్ణయించుకున్నట్లు కన్పిస్తుంది' అని ఉతప్ప పేర్కొన్నాడు.