
జైపూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021లో మాజీ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్లు తమదైన బ్యాటింగ్ శైలితో రెచ్చిపోతున్నారు. మొన్న భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీరబాదుడు బాదాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ రెచ్చిపోయాడు. మంగళవారం ఇండియా లెజెండ్స్‌తో జరుగునున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెజెండ్స్ కెప్టెన్ పీటర్సన్ (75: 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం కెవిన్ పీటర్సన్ సాధించాడు. 18 బంతుల్లోనే రికార్డు హాఫ్ సెంచరీ చేశాడు. కెవిన్ చెలరేగడంతో 20 ఓవర్లలో ఇంగ్లండ్ 7 వికెట్లకు 188 రన్స్ చేసింది. ఇండియా బౌలర్లలో యూసుఫ్ పఠాన్ మూడు వికెట్లు తీశాడు. భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డి మాడి 27బంతుల్లో 29 ట్రాన్స్ చేశాడు. సి స్కోఫీల్డ్, జి హామిల్టన్ చెరో 15 పరుగులు చేశాడు.
లక్ష్య ఛేదనలో ఇండియా లెజెండ్స్ తడబడుతోంది. ఇప్పటికే 5 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (6), సచిన్ టెండూల్కర్ (9) పూర్తిగా విఫలమయ్యారు. మహ్మద్ కైఫ్ (1), యువరాజ్ సింగ్ (20), ఎస్ బద్రీనాథ్ (8) కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఇండియా లెజెండ్స్ 11 ఓవర్లలో 73 రన్స్ చేసింది. క్రీజులో యూసుఫ్ పఠాన్ (8), ఇర్ఫాన్ పఠాన్ (9) ఉన్నారు. భారత్ ఇంకా 48 బంతుల్లో 106 పరుగులు చేయాలి.
ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లకు రొటీన్ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇండియా లెజెండ్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌కు టెస్ట్ చేశారు. మెడికల్ సిబ్బంది తన ముక్కులో నుంచి స్వాబ్ తీసుకున్న తర్వాత నొప్పితో బాధపడినట్లు సచిన్ నటించాడు. అది చూసి వైద్య సిబ్బంది కంగారుపడగా.. సచిన్ నెమ్మదిగా ఓ నవ్వునవ్వాడు. దీంతో ఆ టెస్ట్ చేసిన వారు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. సచిన్ ఇదంతా సరదాగా చేశాడు. స్వయంగా ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. 'నేను 200 టెస్టులు ఆడాను. 277 కొవిడ్ టెస్టులు చేయించుకున్నాను. కాస్త చిలిపి పని చేయడం మూడ్‌ను లైట్ చేస్తుంది' అని ఆ వీడియోకు కాప్షన్ జతచేశాడు.