పర్సనల్ విషయాలు మీకెందుకు?: గట్టిగా ఇచ్చి పడేసిన కెప్టెన్!
ఐపీఎల్ 2026లో భాగంగా తనపై వస్తున్న వ్యక్తిగత విమర్శలపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. లక్నోతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాన్ పరాగ్ మాట్లాడాడు. ఈ విజయం రాజస్థాన్ ప్లేఆఫ్స్ అవకాశాలను ఎంతగానో మెరుగుపరిచింది. మ్యాచ్‌లో 38 బంతుల్లో 93 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై రియాన్ పరాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న ఐపీఎల్ కామెంటేటర్లపై రియాన్ పరాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇటీవల కాలంలో 'వేపింగ్ వివాదం'లో చిక్కుకున్న రియాన్ పరాగ్.. తనపై వస్తున్న వార్తలను, విమర్శలను ఎలా ఎదుర్కొంటున్నారనే ప్రశ్నకు స్పందించారు. తాను మైదానంలో ఏం చేసినా ప్రజలు మాట్లాడుకుంటూనే ఉంటారనే నిజాన్ని తాను గ్రహించానని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి విషయాల వల్ల తన ఆట, ఫామ్ లేదా మానసిక స్థితి దెబ్బతినకుండా చూసుకోవడం ముఖ్యమని చెప్పాడు. "కీబోర్డ్ వారియర్స్" (సోషల్ మీడియా విమర్శకులు) చేసే కామెంట్స్ బయటి వ్యవహారాలని, వాటిని మైదానం బయటే వదిలేయాలని, తన ఆటపై ఉన్న నమ్మకాన్ని ఇవి దెబ్బతీయలేవని రియాన్ పరాగ్ స్పష్టం చేశాడు. మన దేశంలో ప్రజలు క్రికెట్‌ను అమితంగా ప్రేమిస్తారని, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా రాణించడానికి ఆటగాళ్లు ఎప్పుడూ తమ శాయశక్తులా ప్రయత్నిస్తారని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.

క్రికెట్ నిపుణులు, కామెంటేటర్లపై రియాన్ పరాగ్ మరింత ఘాటుగా స్పందించాడు. ఆటలో పొరపాట్లు జరగడం సహజమని, ఏదైనా జట్టు 75 లేదా 80 పరుగులకే ఆలౌట్ అయినప్పుడు వారికి ఆడటం రాదనో, ఆడటం ఇష్టం లేదనో అనడం చాలా సులువు అని రియాన్ పరాగ్ అన్నాడు. ప్రతి మ్యాచ్‌కూ ముందు ప్లేయర్లు ఎంతో కష్టపడి సన్నద్ధమవుతారని, అయితే కొన్నిసార్లు ప్లాన్స్ వర్కవుట్ కావని గుర్తు చేశాడు. కామెంటేటర్ల గొంతు నేరుగా ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి వారు కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడాలని హితవు పలికాడు. స్టేడియం బయట ఉండే ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలను లాగడం సరికాదని.. దేశంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ క్రీడను, ఆటగాళ్లను గౌరవించాలని, కేవలం ఆట గురించే మాట్లాడాలని రియాన్ పరాగ్ డిమాండ్ చేశాడు.
ఇదిలా ఉండగా.. లక్నోపై సాధించిన ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్ తో తన చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రాజస్థాన్ నేరుగా తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications