ఎవరైనా యంగ్ ప్లేయర్లు సరిగా ఆడకపోతే మాజీలు, దిగ్గజాలు వారిపై కామెంట్లు చేయడం సహజమే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి బడా స్టార్లను కూడా వీళ్లు విమర్శిస్తారు. వారిపై అప్పుడప్పుడు ట్వీట్లు కూడా చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా కోహ్లీ, రోహిత్ వంటి వారు వీరిపై ఎలాంటి కామెంట్లు చేయరు. అయితే యువ ప్లేయర్ రియాన్ పరాగ్ మాత్రం సైలెంట్‌గా కూర్చోలేదు.
తనపై కామెంట్లు చేస్తున్న దిగ్గజాలందర్నీ టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో ఈ అస్సాం కుర్రాడు పెద్దగా రాణించలేదన్న సంగతి తెలిసిందే. అయితే అతనిలో చాలా సత్తా ఉందని అందరూ ఒప్పుకుంటారు. కానీ అతని యాటిడ్యూడ్ సరిగా లేదని కొందరు విమర్శిస్తే.. మరికొందరేమో అతని షాట్ సెలెక్షన్‌ను విమర్శించారు. ఇలా తనపై ఫ్యాన్స్, నిపుణులు ఇలా కామెంట్స్ చేయడంపై తాజాగా పరాగ్ స్పందించాడు.
దీనికి సంబంధించిన ఒక వీడియోను రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 'ట్రోలింగ్, కఠిన పరిస్థితులు ఎన్ని ఎదురైనా.. స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఇది రా అండ్ రియల్ రియాన్ పరాగ్' అంటూ వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో తనపై వచ్చే విమర్శలపై పరాగ్ కెమెరా ముందు స్పందించాడు. 'ప్రేక్షకులు తాము కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టి మేం పెర్ఫామ్ చేస్తే చూడటానికి వస్తారు' అని పరాగ్ అన్నాడు.
'మేం ఆడుకుంటుంటే చూడటానికి ప్రజలు రారు. మేం కనుక పెర్ఫార్మ్ చేయకపోతే వాళ్లు మమ్మల్ని ద్వేషిస్తారు. అది నేను అర్థం చేసుకుంటా' అని చెప్పాడు. కానీ మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు తనతో మాట్లాడాలంటే నేరుగా టెక్స్ట్ చేయాలని పరాగ్ అన్నాడు. అంతేకానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎందుకంటూ ఘాటుగా ప్రశ్నించాడు. ఇలా మాజీలు, లెజెండ్స్‌పై పరాగ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

'వెరిఫైడ్ ఖాతాలు, మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు వాళ్లు నా గురించి పోస్టులు పెడుతున్నారు. అంటే నా కోసం ప్రత్యేకంగా టైం తీసుకొని ట్వీట్ చేస్తున్నారు. దాని కన్నా డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయొచ్చు కదా. అలా చేస్తే నేను చాలా సంతోషిస్తాను కూడా' అని పరాగ్ అన్నాడు. 'నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేసి.. నువ్వు ఇలా ఆడతావని తెలుసు. కానీ ఇలా మార్చుకుంటే ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తావ్ అని చెప్తే చాలా సంతోషిస్తా' అని పరాగ్ చెప్పాడు.