ముంబైVsపుణె ప్రివ్యూ: తొలిసారి ధోనీ ఇలా, స్టోక్స్ మెరుపులా.., రోహిత్ దూకుడా?
పుణె: గతంలో రెండు పర్యాయాలు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో గురువారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ జట్టు తలపడనుంది. తొలిసారి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుండటం గమనార్హం. ప్రస్తుతం ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించిన పుణె యాజమాన్యం ఆ బాధ్యతలను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.

కెప్టెన్సీ లేకుండా ధోనీ..
కాగా, పుణె బలమైన జట్టుగానే కనిపిస్తున్నా.. ముంబై కూడా అంతకంటే బలంగానే ఉంది. ఈ క్రమంలో గురువారం జరిగే మ్యాచ్ హోరాహోరీగానే సాగనుంది. అయితే, పుణెకు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఎంత వరకు అండగా నిలుస్తాడో, జట్టు విజయానికి ఎంత వరకూ కృషి చేస్తాడోనన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.

స్టోక్స్ ఏ మేర బలమవుతాడో..
ఈసారి వేలంలో అందరి కంటే ఎక్కువ మొత్తాన్ని అతనే దక్కించుకోవడంతో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు. పుణే అతనిని ఏకంగా 14.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నది. అన్ని ఫార్మాట్స్‌లోనూ రాణించే సత్తావున్న ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్న స్టోక్స్‌పై స్టీవెన్ స్మీత్ నాయకత్వంలోని పుణే ఎక్కువగా ఆధాపడిందన్నది వాస్తవం. ముంబైతో పోరు అతని సామర్థ్యానికి పరీక్షగా నిలవనుంది.

కెప్టెన్సీ బాధ్యతలు ధోనీ నుంచి స్మిత్‌కు
ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణానికి ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ప్రధాన కారకుడు. ఇరు జట్ల మధ్య ఘర్షణలు, వాగ్వాదాల సంఘటనలు పూర్తిగా మరుగున పడకముందే, ఐపిఎల్ టోర్నీ వచ్చేసింది. పుణే జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతను తన జట్టులోని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అజింక్య రహానే వంటి ఆటగాళ్లతో ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి. పుణే ఫ్రాంచైజీ ధోనీని తప్పించి, అతని స్థానంలో స్మిత్‌ను కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేసిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు.

రహానేపైనా అంచనాలు..
ఇలావుంటే, నిరుటి ఎడిషన్‌లో 43.63 సగటుతో రహానే 480 పరుగులు సాధించాడు. అతని స్కోరులో ఆరు అర్ధ శతకాలున్నాయి. ఈసారి అతనిపై అభిమానుల అంచనాలు మరింతగా పెరిగాయన్నది నిజం. రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ధోనీకి నిరుడు పుణే జట్టును నడిపించే అవకాశం దక్కింది.

ధోనీ మార్క్ చూపిస్తాడా.. అశ్విన లేని లోటు
కానీ, ఇప్పుడు స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ధోనీ పాత్ర కేవలం ఒక ఆటగాడిగా మారిపోయింది. ఐపిఎల్‌లో అతను మొట్టమొదటిసారి కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా ఆడనున్నాడు. గ్రేట్ ఫినిషర్‌గా పేరు సంపాదించిన అతను పుణేను ఐపిఎల్‌లో ఎంత వరకూ ఆదుకుంటాడన్నది ముంబైతో గురువారం జరిగే మ్యాచ్‌తో స్పష్టమవుతుంది. కాగా, స్మిత్, ధోనీ, రహానే తదితరులతో పుణే బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా ఉంది. అయితే, అశ్విన్, అశోక్ దిండా దూరంకావడంతో, బౌలింగ్ బలహీన పడడం కాయం.

విజయంపై కన్నేసిన ముంబై
డాషింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్‌కే గురువారం నాటి మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది నిపుణుల అభిప్రాయం. జొస్ బట్లర్, కీరన్ పొరాల్డ్ వంటి హార్డ్ హిట్టర్స్ ఈ జట్టు బ్యాటింగ్ బలాన్ని పెంచుతున్నారు. బౌలింగ్‌లో హర్భజన్ సింగ్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. మిచెల్ జాన్సన్, లెడల్ సిమన్స్, లసిత్ మలింగ తదితరులు జట్టులో ఉన్నారు. నిరుడు ఐదో స్థానంతో సంతప్తృ చెందిన ముంబై ఈసారి మెరుగైన స్థానం కోసం పోరాడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications