
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ చివరి ఓవర్లో రచ్చరచ్చ జరిగిన సంగతి తెలిసిందే. చివరికి 15 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయం పట్ల ఢిల్లీ కెప్టెన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. చివరి మూడో బంతికి మెక్‌కాయ్ వేసిన ఫుల్ టాస్‌ను నోబాల్‌గా అంపైర్ నితిన్ మీనన్ ప్రకటించకపోవడంతో డగౌట్లో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్ సీరియస్ అవుతూ.. ఇంకా ఆడాల్సిన అవసరం లేదు పావెల్.. వాళ్లకు గెలుపు ఇచ్చేస్తున్నాం.. వచ్చేసేయ్ అంటూ డగౌట్ నుంచి చేయి ఊపుతూ సైగ చేశాడు.
అలాగే కోచ్ ఆమ్రేను స్టేడియంలోకి పంపించాడు. ఆమ్రే సైతం స్టేడియంలోని అంపైర్లతో తీవ్రంగా వాదించాడు. కానీ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎలాగోలా చివరి వరకు గేమ్ సాగింది. కానీ పంత్ మాత్రం మ్యాచ్‌లో అంపైర్ విషయంలో జరిగిన తప్పిదం గురించి తీవ్ర నిరాశ చెందాడు.
మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ.. 'రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు.. ఇన్నింగ్స్ మొత్తం చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ఆ విషయాన్ని నేను కాదనను, కానీ చివరి ఓవర్లో మా బ్యాటర్ పావెల్ పుంజుకుని ఆడాడు. రాజస్థాన్ ప్లేయర్ మెక్‌కాయ్ మూడో బంతికి వేసిన నోబాల్ మాకు ఆ టైంలో అత్యంత విలువైనది. నోబాల్ వస్తే ఫలితం మరోలా ఉండేది. దాన్ని అంపైర్ మాత్రం ఫెయిర్ డెలివరీగానే ప్రకటించాడు. ఆ నిర్ణయాన్ని సరిచేసే అధికారం నాకు లేదు. దీంతో పూర్తిగా నిరాశ చెందాను. అందుకే పావెల్‌ను ఆడొద్దు వచ్చేయ్యమన్నాను. కానీ ఇంకా దీన్ని పెద్ద ఇష్యూ చేయదల్చుకోలేదు. నేనే కాదు.. డగౌట్లో ఉన్న మా టీం అంతా నిరుత్సాహపడ్డాం.

స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అందరూ చూశారు. థర్డ్ అంపైర్ జోక్యం చేసుకుని అది నోబాల్ అని ప్రకటించాల్సింది. కానీ అలా జరగలేదు. ఇక నా విషయంలో మా కోచ్ అమ్రేను మైదానంలోకి పంపడం సరికాదు. ఆ క్షణంలో ఆవేశంలో అలా ప్రవర్తించాను. కానీ మాతో అంపైర్లు వ్యవహరించిన విధానం కూడా సరైంది కాదు. ఇరువైపుల తప్పు జరిగింది. ఐపీఎల్ టోర్నమెంట్‌లో చాలా మంచి అంపైరింగ్‌ని ఇప్పటివరకు చూశాం. కానీ ఈ తరహా అంపైరింగ్ మమ్మల్ని తీవ్ర ఆవేదనకు లోను చేసింది. ప్రత్యర్థి జట్టు విధించిన లక్ష్యానికి చేరువవుతుండగా ఇలాంటి తప్పుడు నిర్ణయం ఇంకా కలిచివేసింది. ఇక తర్వాతి మ్యాచ్‌లో మేము మరింత మెరుగ్గా బౌలింగ్ చేయగలమని అనుకుంటున్నా. మా టీంమేట్స్ ను కూడా ఇది మర్చిపోయి తర్వాతి మ్యాచ్ కు సిద్ధం కావాలని సూచిస్తా' అన్నాడు.
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. జోస్ బట్లర్ (116పరుగులు 65బంతుల్లో 9ఫోర్లు, 9సిక్సర్లు), దేవదత్ పడిక్కల్ (54పరుగులు 35బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) , కెప్టెన్ సంజూ శాంసన్ (46పరుగులు 19బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు నాటౌట్) చెలరేగడంతో 222పరుగుల భారీ స్కోరు సాధించింది. 223పరుగుల భారీ టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ప్లేయర్లలో పృథ్వీ షా (37పరుగులు 27బంతుల్లో), డేవిడ్ వార్నర్ (28పరుగులు 14బంతుల్లో), రిషబ్ పంత్ (44పరుగులు 24బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), లలిత్ యాదవ్ (37పరుగులు 24బంతుల్లో) రాణించారు. చివర్లో రోవ్‌మెన్ పావెల్ (36పరుగులు 15బంతుల్లో 5సిక్సర్లు) చెలరేగినా ఢిల్లీకి పరాజయం తప్పలేదు.