
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. భారత భవిష్యత్తు టెస్ట్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను తీర్చిదిద్దాలని సెలక్టర్లకు సూచించాడు. ఎంఎస్ ధోనీని ఉదాహరణగా పేర్కొన్న యువరాజ్.. టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా పంత్ సరైన ప్లేయర్ అని పేర్కొన్నాడు. కోహ్లీ ఈ ఏడాది తొలినాళ్లలో దక్షిణాఫ్రికాలో ఒకట్రెండు ఓటములు ఎదుర్కొన్న తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అనంతరం టీమిండియా అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సు 34ఏళ్లు. రోహిత్ టెస్ట్ ఫార్మాట్‌లో ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగే అవకాశాలు లేవు. యువరాజ్ సూచనల ప్రకారం.. పంత్ కెప్టెన్సీ నైపుణ్యాలు కలిగి ఉన్నాడని, ప్లేయింగ్ 11లో ఇప్పటికే అతని స్థానం స్థిరంగా ఉన్నందున అతన్ని కెప్టెన్సీ వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశం వెలిబుచ్చాడు. అలాగే కెప్టెన్‌గా నిలదొక్కుకోవడానికి పంత్‌కు తగిన సమయం, సహకారం కూడా ఇవ్వాలని, అతని నుంచి అద్భుతాలు వెంటనే ఆశించకూడదని అభిప్రాయపడ్డాడు.
టీమిండియా భావి కెప్టెన్ విషయమై యువరాజ్ సెలెక్టర్లకు సూచనలిస్తూ.. 'మీరు ఇప్పటినుంచే టెస్ట్ కెప్టెన్ కోసం ఎవరినైనా సిద్ధం చేయాలి. గతంలోనూ మహీని కెప్టెన్‌గా చేసినప్పుడు నిదానంగా అతను నిలదొక్కుకున్నాడు. ప్రపంచంలోనే గొప్ప కెప్టెన్‌లలో ఒకడిగా మారాడు. తన అనుభవాల నుంచే గొప్ప సారథ్యాన్ని అందించాడు. అలాగే మీరు టెస్ట్ క్రికెట్‌కు కాబోయే కెప్టెన్‌గా యంగ్ ప్లేయర్‌ను ఎంచుకోండి. అతనికి కొంత టైం ఇవ్వండి. తొలి ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం వరకు అతని కెప్టెన్సీని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వెంటనే అద్భుతాలు జరగాలని ఆశించొద్దు. కెప్టెన్‌గా టీమిండియాను నడిపించగలరని యంగ్ ప్లేయర్లను విశ్వసించండి'అని ఓ షోలో యువరాజ్ పేర్కొన్నాడు. ఇక 2007 వన్డే ప్రపంచ కప్‌లో దారుణ పరాభవం తర్వాత రాహుల్ ద్రావిడ్ టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు 26ఏళ్ల ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలాగే అనిల్ కుంబ్లే పదవీ విరమణ ప్రకటించాక.. ధోనీ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
రిషబ్ పంత్‌కు ఇంకా కెప్టెన్ అయ్యేంత మెచురిటీ లేదంటున్న విమర్శకుల అభిప్రాయాలను యువరాజ్ సింగ్ తోసిపుచ్చాడు. ఇందుకు విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాలని కోహ్లీని సెలెక్టర్లు కోరినప్పుడు.. కోహ్లీ ఆ సమయంలో కెప్టెన్సీ కాగలిగే మెచురిటీ తనకు లేదని పేర్కొన్నాడని యువరాజ్ తెలిపాడు. కొంతకాలంగా పంత్ తన ఆటను మెరుగు పరుచుకుంటున్నాడని కోహ్లీ పేర్కొన్న విషయాన్ని కూడా యువరాజ్ ప్రస్తావించాడు. ఇక తన అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత టెస్ట్ జట్టును లీడ్ చేయడానికి పంత్ సరైన ప్లేయర్ అని విశ్వసిస్తున్నా అని యువరాజ్ స్పష్టం చేశాడు.