గతేడాది భయంకరమైన యాక్సిడెంట్‌కు గురైన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ఈ యాక్సిడెంట్ కారణంగా పంత్‌కు కనీసం 18 నెలల విశ్రాంతి అవసరం అని వైద్యులు భావించారు. అయితే మంచి క్రమశిక్షణ చూపించిన పంత్ వేగంగా కోలుకుంటున్నాడు.
ఈ ప్రమాదం జరిగిన ఎనిమిది నెలల్లోనే నెట్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇప్పుడు ఎన్సీయేలో అతను 140+ కిలోమీటర్ల వేగంతో వస్తున్న బంతులను కూడా చక్కగా ఎదుర్కొంటున్నాడట. ఈ విషయాన్ని ఎన్సీయే వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికీ ఇంకా పూర్తిగా రీఎంట్రీ ఇచ్చే అంత ఫిట్‌నెస్ అయితే సాధించలేదని వైద్యులు అంటున్నారు.

పంత్ ఇంత వేగంగా కోలుకోవడం చూసిన ఎన్సీయే వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది చూస్తుంటే త్వరలోనే అతను మళ్లీ టీమిండియా తలుపు తట్టేలా ఉన్నట్లు కనిపిస్తోంది. పంత్ కోసం ప్రత్యేకంగా ఎన్సీయే ఒక రికవరీ షెడ్యూల్‌ను తయారు చేశారు. ఇప్పుడు అతను ఇంత వేగంగా కోలుకుంటున్న క్రమంలో కొత్త టార్గెట్‌తో ఈ షెడ్యూల్ ఏర్పాటు చేస్తున్నారట.
'రిషభ్ పంత్ చాలా వేగంగా రికవర్ అవుతున్నాడు. ఇప్పుడు అతను 140 కిలోమీటర్ల పైగా వేగంతో వస్తున్న బంతులను ఎదుర్కొంటున్నాడు. తన రికవరీ చూసి చాలా సంతోషంగా ఉంది. తన రికవరీలో ఎదురయ్యే ప్రతి హర్డిల్‌ను పంత్ దాటుతున్నాడు. ఇక నుంచి ఇంకొన్ని పెద్ద, వేగవంతమైన మూవ్‌మెంట్లపై ఫోకస్ పెడతాం. వచ్చే మరికొన్ని నెలల్లో దీనిపైనే పని చేస్తాం' అని ఎన్సీయే వర్గాలు చెప్పాయి.
గతేడాది యాక్సిడెంట్ తర్వాత పంత్ మోకాళ్లకు పలు శస్త్రచికిత్సలు జరిగాయి. దీంతో అతను మళ్లీ ఇప్పుడప్పుడే వికెట్ కీపింగ్ చేయలేడని వైద్యులు భావించారు. కానీ చాలా వేగంగా కోలుకుంటున్న పంత్.. డాక్టర్లకు కూడా షాక్ ఇస్తున్నాడట. ఈ వార్త తెలిసిన పంత్ ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. ఇలాగైతే వచ్చే ఐపీఎల్ నాటికి పంత్ ఫుల్ రికవర్ అవుతాడని ఆశిస్తున్నారు.