హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయాలని పరితపిస్తున్న రైజింగ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ సంచలనం సృష్టించాడు. క్రికెట్ ఎక్విప్‌మెంట్ తయారీదారు శాన్స్‌పరిల్స్ గ్రీన్‌లాండ్ (ఎస్‌జీ)తో కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.
అన్ని ఫార్మెట్లలో రిషబ్ పంత్ మూడేళ్ల కాలపరిమితికి అగ్రిమెంట్‌పై సంతకం చేశాడని ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (పీఎమ్‌జీ) విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మాజీ అండర్-19 క్రికెట్‌లో సత్తా చాటిన రిషబ్ పంత్ ప్రస్తుతం రంజీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు.

ప్రస్తుత రంజీ సీజన్‌లో రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రంజీల్లో ఇప్పటికే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. ఇక ఇటీవల జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లోనే 100 పరుగులు చేసి అత్యంత వేగంగా సెంచరీ చేసిన రంజీ ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మూడో పిన్న వయస్కుడిగా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఈ రంజీ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించాడు. ఇక ఎస్‌జీతో కుదిరిన ఒప్పందంపై రిషబ్ పంత్ సంతోషాన్ని వ్కక్తం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు సంబంధించి ఆటగాళ్ల సామాగ్రిని ఈ కంపెనీ తయారు చేస్తోంది.