
గిల్ అదరహో:
నాలుగు పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్ శుభమన్ గిల్ (91: 146 బంతుల్లో 8x4, 2x6)తో జతకట్టిన ఛెతేశ్వర పుజారా (56: 211 బంతుల్లో 7x4) ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్‌మెన్ గిల్ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. ఆ తర్వాత రెండో సెషన్‌లో సెంచరీకి కేవలం 9 పరుగుల దూరంలో గిల్ ఔటయ్యాడు.

అడ్డుగోడలా పుజారా:
శుభమన్ గిల్ అనంతరం అజింక్య రహానే క్రీజులోకి వచ్చాడు. రహానే వచ్చిన తర్వాతి ఓవర్‌లో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పుజారా గాయపడ్డాడు. ఐతే అతనికి ఎలాంటి గాయం కాలేదు. దీంతో పుజారా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. రహానే వేగంగా ఆడాడు. మరోవైపు పూజారా కూడా వేగం పెంచాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో రహానే (24) పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 167 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్ పూర్తయ్యే సమయానికి భారత్ 183/3తో నిలిచింది. ఇక మూడో సెషన్‌లో భారత్ విజయానికి 144 పరుగులు చేయాల్సి ఉండడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్నారు. పుజారా, పంత్ ఆ విధంగానే ఆడారు. వారిద్దరూ వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే జట్టు స్కోర్ 228 పరుగుల వద్ద పుజారా నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.

పంత్, సుందర్ అటాకింగ్:
పుజారా అనంతరం మయాంక్ అగర్వాల్ (9) స్వల్ప స్కోరుకు పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత్ స్కోర్ 265. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. సిడ్నీ టెస్ట్‌లో 97 పరుగులు చేసి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించిన పంత్.. ఈసారి కూడా ఎదురుదాడికి దిగాడు. భారత్ విజయానికి 62 పరుగులు అవసరమైన వేళ వాషింగ్టన్ సుందర్ (22; 29 బంతుల్లో 2x4,1x6) కూడా చెలరేగడంతో రహానే సేన విజయానికి చేరువైంది. అయితే సుందర్, శార్దూల్ ఠాకూర్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అప్పటికే భారత్ గెలుపు ఖాయమైంది. 97వ ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టిన పంత్.. భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
గబ్బా మైదానంలో చరిత్ర:
ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడు వందలకుపైగా స్కోర్లు చేజ్ చేసి గెలవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై. అందులోనూ ఇప్పటి వరకూ ఎప్పుడూ గెలవని బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఇంత భారీ స్కోరు ఛేదించడం అనేది సాధారణ విషయం కాదు. ఇక విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శిఖర్ దావన్, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్, ఇషాన్ శర్మ, మొహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్ల లేకుండానే పటిష్టమైన ఆసీస్ టీంపై విజయాన్ని సాధించి ఔరా అనిపించింది. 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని కంగారూ జట్టుకు టీమిండియా ఓటమి రుచి చూపించింది.
స్కోర్ వివరాలు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 369 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 336 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 294 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ : 329/7


Click it and Unblock the Notifications












