గతేడాది చివర్లో భారీ రోడ్డు ప్రమాదం కారణంగా క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి పంత్ ఇప్పటి వరకు బ్యాటు పట్టింది లేదు. అయితే కొన్ని రోజుల క్రితం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)కు వెళ్లిన అతను.. అక్కడ రిహాబిలేషన్‌లో ఉన్నాడు. ఆపరేషన్ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు.
ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో పంత్‌కు శస్త్రచికిత్స జరిగింది. అనంతరం అతనికి మరో ఆపరేషన్ చేయాల్సి రావొచ్చని వైద్యులు భావించారు. అయితే పంత్ చాలా వేగంగా కోలుకోవడంతో అతనికి మరో ఆపరేషన్ అక్కర్లేదని మెడికల్ టీం తేల్చింది. ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్న పంత్.. తన రోజువారీ రీహాబ్ సెషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ ప్రమాదం వల్లనే పంత్ ఈ ఏడాది ఐపీఎల్ కూడా ఆడలేదు.

ఇంగ్లండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా పంత్ దూరమయ్యాడు. అయితే ఎన్సీయేకు చేరిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న అతను తాజాగా మరో ఇన్‌స్పిరేషనల్ పోస్టు పెట్టాడు. ఈ ఫొటోలో పంత్ ఎన్సీయేలో ఒక స్లోగన్ ముందు నిలబడి ఉన్నాడు. 'బి లెజెండరీ' (లెజెండ్‌లా ఉండు) అనే స్లోగన్ ముందు పంత్ తన సెషన్స్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను పంచుకున్న అతను.. జిమ్ ఏరియాకు వెళ్తూ కనిపించాడు.