ధోనీ సలహాలు ఇస్తాడు కానీ.. పూర్తిస్థాయి పరిష్కారం మాత్రం చెప్పడు: పంత్

ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ యువ ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని యువ క్రికెటర్ రిషభ్ పంత్ తెలిపాడు. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ధోనీ తనకు సలహాలు చెప్పేవాడని, అయితే పూర్తిస్థాయి పరిష్కారం మాత్రం ఇవ్వకపోవడంతో వాటిని తనే పరిష్కరించుకునేవాడినని తెలిపాడు. ఇలా చేయడంతో ధోనీపై అతిగా ఆధారపడకుండా ఉండటానికి వీలయ్యేదని పంత్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీని మించిన అత్యుత్తమ భాగస్వామి మరొకరు ఉండరన్నాడు.

ధోనీ సలహాలు ఇస్తాడు కానీ:
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తాజాగా నిర్వహించిన సోషల్ మీడియా సెషన్‌లో పాల్గొన్న పంత్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. 'మహీ భాయ్ నాకు మెంటార్ లాంటి వాడు. మైదానం లోపల, బయట ఎన్నో విషయాల్లో అతడే నాకు స్ఫూర్తి. యువ ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడానికి ధోనీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. సమస్యలు ఎదురైనప్పుడు ధోనీ కొన్ని సలహాలు చెప్పేవాడు. అయితే అవి పూర్తిస్థాయిలో మాత్రం ఉండేవి కావు. సమస్యలను నేనే సాల్వ్ చేసుకోవాలని కొంచెం హింట్ మాత్రమే ఇచ్చేవాడు. దీంతో ధోనీపై అతిగా ఆధారపడకుండా ఉండటానికి వీలయ్యేది' అని పంత్ పేర్కొన్నాడు.

ఫేవరెట్ బ్యాటింగ్ పార్ట్‌నర్ ధోనీ:
'ఎంఎస్ ధోనీ మరో ఎండ్‌లో ఉంటే అసలు ఒత్తిడనేదే ఉండదు. హాయిగా మన పని మనం చేసుకోవచ్చు. మహీ క్రీజులో ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది, అతని ప్రణాళికలకు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తే సరిపోతుంది. అతడితో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం చాలా తక్కువ సార్లే వచ్చినా.. అది ఎప్పటికి మరువలేను. ధోనీ కంటే ఉత్తమ భాగస్వామి మరొకరు ఉండరు' అని పంత్ అన్నాడు. భారత్ తరఫున ఆడే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేస్తుంటే అనేక విషయాలు నేర్చుకోవచ్చు అని పంత్ చెప్పాడు.

టెస్టు ఫార్మాటే అత్యుత్తమమైనది:
'కెరీర్ తొలినాళ్లలో దేశవాళీల్లో ఆడిన నాలుగు రోజుల మ్యాచ్‌లే గొప్ప అనుకునే వాడిని. కానీ.. టెస్టు క్రికెట్ ఆడాక అందులోని అసలు సిసలు మజా ఏంటో తెలిసొచ్చింది. అందుకే టెస్టులు ఆడేందుకు ఇష్టపడతా. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టు ఫార్మాటే అత్యుత్తమమైనది. సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించాలంటే కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది' అని పంత్ చెప్పాడు. రోల్ మోడల్‌గా ఎంచుకున్న ఆటగాళ్ల నుంచి నేర్చుకోవాలే తప్ప వారిని కాపీ కొట్టేందుకు ప్రయత్నించడం సరైంది కాదని పంత్ చెప్పాడు.

రాహుల్ రాణించడంతో:
రిషభ్ పంత్ తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన రెండేళ్ల కాలంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాడు. కెరీర్ మొదట్లో ఒక కీలక ఆటగాడిగా ఉన్న పంత్.. ఆ తర్వాత ఫామ్‌ను కోల్పోయి జట్టులో స్థానంపై నమ్మకాన్ని కోల్పోయాడు. పంత్ టాలెంటెడ్ ఆటగాడని చెబుతూ వచ్చిన మేనేజ్‌మెంట్ పెద్దలే అతన్ని పక్కన పెట్టేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో పంత్‌కు అయిన గాయం అతని కెరీర్‌నే ప్రమాదంలో పడేసింది. పంత్ స్థానంలో కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించిన కేఎల్ రాహుల్.. అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కీపర్‌గా రాణించడంతో పంత్ అవసరం లేకుండా పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications