ఇదే మా విజయ రహస్యం.. అందువల్లే గెలిచాం: రిషబ్ పంత్
సీఎస్కేపై ఘనవిజయం సాధించిన అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ.. ఈ విజయం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పంత్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ.. "గెలవడం ఎప్పుడూ మంచి అనుభూతినిస్తుంది. ప్లేఆఫ్స్ నుంచి ఔటైనప్పటికీ.. ఆడే ప్రతి మ్యాచ్‌కు విలువ ఉంటుందని మేము చర్చించుకున్నాం. ఈ పద్ధతిలో క్రికెట్ ఆడటాన్ని మేము గర్వంగా భావిస్తాం" అని రిషబ్ పంత్ పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ గెలుపు కోసం చివరి వరకు పోరాడటం తనను సంతోషపరిచిందని పంత్ వివరించాడు.
ఆకాష్ సింగ్ అద్భుత బౌలింగ్
యువ బౌలర్ ఆకాష్ సింగ్ ప్రదర్శనను పంత్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. "ఆకాష్ ఈ ఐపీఎల్ అంతా కష్టపడుతూనే ఉన్నాడు. అందరికీ ప్రతి మ్యాచ్‌లో అవకాశం ఇవ్వడం కష్టమే, కానీ అతను తన ప్రిపరేషన్ ఎప్పుడూ ఆపలేదు. ప్లాన్‌కు కట్టుబడి బౌలింగ్ చేయడంలో అతను దిట్ట. సుదీర్ఘ సమయం పాటు తన లైన్ అండ్ లెంగ్త్ మార్చకుండా బౌలింగ్ చేశాడు, అందుకే అతనికి వికెట్లు దక్కాయి. అతని హార్డ్ వర్క్ ఫలించడం చూడటం చాలా ఆనందంగా ఉంది" అని రిషబ్ పంత్ పేర్కొన్నాడు.

ఓపెనింగ్ వ్యూహం
జట్టు వ్యూహాల గురించి వివరిస్తూ.. "ఇద్దరు విదేశీ ఆటగాళ్లను ఓపెనింగ్‌కు పంపడం, నికోలస్ పూరన్‌ను మూడో స్థానంలో ఆడించడం మా మొదటి ఆలోచన. అనుకున్నది మైదానంలో అమలు చేయడం కొన్నిసార్లు కష్టమవుతుంది. జట్టుగా మాకు మంచి సత్తా ఉంది, కానీ కొన్ని చిన్న చిన్న విషయాల వల్ల అనుకున్నది జరగకపోతే కొంత నిరాశగా అనిపిస్తుంది. హోమ్ గ్రౌండ్‌లో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో ఆడటం మాకు బాగా కలిసొచ్చింది. అయితే అతిగా వ్యూహాల మీద ఆధారపడటం కూడా కొన్నిసార్లు నష్టాన్ని కలిగిస్తుంది" అని రిషబ్ పంత్ విశ్లేషించాడు.
బ్యాటింగ్ ఎందుకు చేయలేదు?
తాను బ్యాటింగ్‌కు రాకపోవడంపై పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "నేను బ్యాటింగ్‌కు రావడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు ఓ ఆలోచన వచ్చింది. ఇప్పటివరకు సరైన అవకాశాలు రాని ఆటగాళ్లను ఎందుకు పరీక్షించకూడదని భావించాను. నేను మైదానంలో ఉండాలని అనుకున్నప్పటికీ.. థింక్ ట్యాంక్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాను. అందుకే తక్కువ అవకాశాలు వచ్చిన వారికి బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చాం" అని రిషబ్ పంత్ స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications