భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగాడు. నవంబర్ 22(శుక్రవారం) నుంచి గౌహతి వేదికగా టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ గౌహతి నుంచి ముంబైకి పయనమయ్యాడు. గిల్ నవంబర్ 19నే జట్టుతో చేరినా నవంబర్ 20న ప్రాక్టీస్‌కు మాత్రం హాజరు కాలేదు. ఈ క్రమంలో గిల్ స్థానంలో జట్టు బాధ్యతలను రిషబ్ పంత్ స్వీకరించనున్నాడు.
గాయం తీవ్రత: ముంబైలో స్పెషలిస్ట్ సలహా
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం.. శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం ముంబైలో రెండు నుంచి మూడు రోజులు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ దినషా పర్దివాలా నుంచి మెడ నొప్పికి సంబంధించి ప్రత్యేక సలహా తీసుకోనున్నాడు.

తొలి టెస్ట్‌లో అసలు ఏం జరిగింది?
కోల్‌కతాలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే గిల్‌కు గాయమైంది.మ్యాచ్ రెండవ రోజున బ్యాటింగ్‌కు వచ్చిన వెంటనే, కొన్ని బంతులు ఎదుర్కొన్న తర్వాత మెడలో తీవ్రమైన అసౌకర్యాన్ని అనుభవించాడు. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, అతను రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాల్సి వచ్చింది. గాయం తీవ్రత దృష్ట్యా, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ మ్యాచ్‌లో అతను మళ్లీ ఆడలేదు. జట్టుతో కలిసి గువహాటి వచ్చినా, చివరకు రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు.
కెప్టెన్‌గా రిషబ్ పంత్
శుభ్‌మన్ గిల్ దూరమవడంతో అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీని చేపట్టనున్నారు. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడంలో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు మేనేజ్‌మెంట్‌కు కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో సాయి సుదర్శన్ లేదా నితీష్ కుమార్ రెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. అదనపు స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను బెంచ్‌కే పరిమితం చేసే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ మాత్రమే పాల్గొన్నారు.గిల్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని టెస్ట్‌లో ఆడాలనుకున్నప్పటికీ, జట్టు యాజమాన్యం అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.
వన్డే సిరీస్‌లో ఆడతాడా?
దక్షిణాఫ్రికాతో భారత జట్టు నవంబర్ 29 నుంచి వన్డే సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. అయితే గిల్ ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్నందున, ఆ వన్డే సిరీస్‌లో అతను పాల్గొంటాడా లేదా అనే విషయంపై ఇంకా అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు.