
లండన్: వరుస మ్యాచ్‌ల వైఫల్యాలతో విసిగిపోతున్న టీమిండియాకు ఓ శుభవార్త. ఇంగ్లాండ్ పర్యటన మొదలైనప్పటి నుంచి టీమిండియా జట్టులో కనిపించని భారత బౌలర్ బుమ్రా మూడో టెస్టుకు సిద్ధమైయ్యాడు. గాయం నుంచి బుమ్రా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడకముందు టీమిండియా ఐర్లాండ్‌తో మూడు టీ20లు ఆడింది. ఆ సమయంలోనే బుమ్రా గాయపడ్డాడు. దాంతో బుమ్రా ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ల్లో ఆడలేకపోయాడు.
తాజాగా బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ కుమార్, బుమ్రా లేకపోవడం ఇప్పటి వరకు భారత్‌కు పెద్ద దెబ్బే. ఇప్పుడు బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడన్న వార్త భారత అభిమానులకు శుభవార్తే. ఇంగ్లాండ్‌తో తొలి మూడు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలెక్టర్లు... బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలిపి అతడికి జట్టులో చోటు కల్పించారు. కానీ, బుమ్రా ఆశించిన స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదు. రెండో టెస్టుకు దూరమయ్యాడు.
నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఈ నెల 18న ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభంకానుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. భారత్ తిరిగి పోటీలో నిలవాలంటే మూడో టెస్టులో కచ్చితంగా గెలిచి తీరాలి. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని, మూడో టెస్టులో ఆడతాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే బుమ్రా రాకతో టీమిండియా బౌలింగ్ మరింత బలంగా మారనుంది. కానీ, బ్యాట్స్‌మెన్ వైఫల్యాన్ని ఎలా అధిగమించాలో మాత్రం భారత్‌కు అర్థం కావడం లేదు.
తొలి టెస్టులో కేవలం కోహ్లీ మాత్రమే రాణించగా.. రెండో టెస్టులో కోహ్లీ కూడా ఎంతోసేపు క్రీజులో నిలవలేకపోయాడు. వెన్నునొప్పి కారణంగా ఆడుతున్నంత సేపు ఇబ్బందిపడిన కోహ్లీ మూడో టెస్టులోపు కోలుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఒకవేళ కోలుకోలేకపోయినా కోహ్లీ ఆడితేనే బాగుంటుందని సీనియర్ క్రికెటర్లు పేర్కొంటున్నారు. జట్టు వైఫల్యాన్ని రవిశాస్త్రి ఒప్పుకోవాల్సిందేనంటూ అతనిపై కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.