
మెల్‌బోర్న్: మెల్‌బోర్న్‌లో మంగళవారం ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారథ్యంలోని భారత జట్టు 8 వికెట్ల తేడాతో విక్టరీని సొంతం చేసుకుని టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదటి టెస్టులో ఘోర పరాభవం పాలై, రెండో టెస్టులో పుంజుకొని అన్ని రంగాల్లో ఆదిపత్యం చలాయించి ఘనవిజయం సాధించడంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత అందుకున్నాడు.
ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా ఎనమిది టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 25 పరుగులకు పైగా స్కోర్ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ మాత్రమే. ఆసీస్ గడ్డపై ఏ భారత బ్యాట్స్‌మన్ కూడా వరుస 8 ఇన్నింగ్స్‌లలో 25 పరుగులకు పైగా స్కోర్ చేయలేదు. రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ లాంటివారికి కూడా ఈ స్కోర్ సాధ్యం కాలేదు. 25, 28, 36, 30, 39, 33, 159, 29 రన్స్ చేశాడు పంత్.
బాక్సింగ్ డే టెస్ట్ మూడో రోజు ఆటలో రిషబ్ పంత్, మాథ్యూ వేడ్ మధ్య సరదా స్లెడ్జింగ్ నడిచిన విషయం తెలిసిందే. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా వేడ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనుకాల పంత్ ఏదో ఒకటి అరుస్తూ బౌలర్లను ఉత్సాహపరిచాడు. ఇక పంత్ మాటలకు చిర్రెత్తుకుపోయిన వేడ్ అతనికి ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు. 'పంత్ నువ్వు 25 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నావు. ఖచ్చితంగా 20 నుంచి 30 కిలోలు అధిక బరువు ఉంటావు. ఎప్పుడైన నిన్ను నీవు బిగ్ స్క్రీన్‌పై చూసుకున్నావా? నిన్ను స్క్రీన్‌లో చూస్తే ఫన్నీగా కనిపిస్తావ్' అని కామెంట్ చేశాడు.
నాలుగో రోజు ఆటకు ముందు ఈ స్లెడ్జింగ్ వ్యవహారంపై స్పందించిన రిషబ్ పంత్.. తాను నిశబ్దంగా ఉండటానికి గల కారణాన్ని తెలియజేశాడు. మాథ్యూ వేడ్ కావాలనే తనను రెచ్చగొడుతున్నాడనే విషయం తనకు అర్థమైందని, అందుకే అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే బదులివ్వలేదని స్పష్టం చేశాడు. తొలి టెస్టులో కీపర్ సాహా విఫలమవడంతో పంత్‌కు రెండో టెస్టులో అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో రహానేకు అండగా నిలిచాడు.