
రిషబ్ పంత్ భారత జట్టు భవిష్యత్తు ఆశాకిరణం అని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ పేర్కొన్నాడు. దీర్ఘకాలంలో అతను గొప్ప ప్లేయర్‌గా ఎదగగలడంటూ సపోర్టివ్ వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20లో పంత్ ప్లేయింగ్ 11లో లేడు. అతన్ని తప్పించి దినేష్ కార్తీక్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. టీ20ఫార్మాట్‌లో పంత్ తన సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. అందువల్లే అతను టీ20లకు సరిపోడంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పంత్ ఈ ఏడాది 17 టీ20ల్లో 25.91సగటుతో కేవలం 311పరుగులు మాత్రమే చేశాడు. 25ఏళ్ల పంత్ టీ20ల్లో నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఇటీవల ఆసియా కప్ 2022లో పంత్ కేవలం మూడు ఇన్నింగ్స్‌లలో 51పరుగులు మాత్రమే చేయగలిగాడు.
తాను సెలెక్టర్‌గా ఉండుంటే రిషబ్ పంత్‌ను తుది జట్టులో పక్కా ఉంచుతానని మాథ్యూ హేడెన్ పేర్కొన్నాడు. అతను పరుగులు చేయడంలో విఫలమైనప్పటికీ అతనికి మద్దతు ఇవ్వాలని హేడెన్ తెలిపాడు. వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన పంత్ ప్రతి అంశంలో అత్యుత్తమంగా ఉన్నాడని చెప్పాడు. 'నేను సెలెక్టర్‌గా ఉంటే రిషబ్ పంత్‌ను ప్రతి ఫార్మాట్లో ప్లేయింగ్ 11లో తీసుకుంటా. అతను టీమిండియాకు భవిష్యత్తు ఆశా కిరణం. అతనికి తగినంత మద్దతు ఇవ్వాలి. అలాగే కాస్త సమయం కూడా కావాలి. రన్స్ ధారాళంగా చేసేవరకు లేదా ఫామ్ పుంజుకునేవరకు అతన్ని ఆడించాలి. అతను నా ఉద్దేశం ప్రకారం.. అన్ని విధాలుగా అత్యుత్తమ ఆటగాడు' అని ఆస్ట్రేలియాతో జరిగిన ఒకటో టీ20 సందర్భంగా హేడెన్ తెలిపాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు బౌలింగ్లో తీవ్రంగా నిరాశపర్చింది. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ లాంటి బౌలర్లు ఉన్నప్పటికీ భారత్ 209పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఆసీస్ బ్యాటర్లు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. రెండో టీ20 రేపు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా పంత్ ప్లేయింగ్ 11లోకి వస్తాడో లేదో చూడాలి.