రోడ్డు ప్రమాదానికి గురైన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను చూసి కన్నీటిని ఆపుకోలేకపోయానని ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి తెలిపాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన రవిశాస్త్రి భావోద్వేగంతో మాట్లాడాడు. ఫీల్డింగ్ మెడల్‌ను పంత్‌కు అందజేస్తూ ఎమోషనల్ అయ్యాడు. మృత్యువును జయించి తిరిగి మైదానంలో అడుగుపెట్టిన పంత్ ప్రపంచానికి ప్రేరణ అని పేర్కొన్నాడు. 2022 డిసెంబర్‌లో పంత్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్‌పై భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (42; 31 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా (3/21), హారిస్ రవూఫ్ (3/21) చెరో మూడు వికెట్లు, మహ్మద్ అమీర్ (2/23) రెండు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. బుమ్రా (3/14) మూడు, హార్దిక్ పాండ్య రెండు (2/24), అర్షదీప్ (1/31), అక్షర్ పటేల్ (1/11) చెరో వికెట్ తీశారు. మహ్మద్ రిజ్వాన్ (31; 44 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) పోరాడాడు. పంత్ లీడింగ్ స్కోరర్‌తో పాటు మూడు కీలక క్యాచ్‌లు అందుకున్నాడు. ఫకర్ జమాన్, ఇమాద్ వసీమ్, షాదబ్ ఖాన్‌లను ఔట్ చేయడంతో తనవంతు పాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఫీల్డింగ్ మెడల్‌ను పంత్‌కు ప్రదానం చేస్తూ రవిశాస్త్రి మాట్లాడాడు. ''పంత్ రోడ్డు ప్రమాదం గురించి చదివినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇక అతన్ని హాస్పిటల్‌లో చూసినప్పుడు మరింత చలించిపోయా. ఆ దశ నుంచి గొప్పగా కోలుకుని అత్యున్నత పోరు అయిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో పంత్ ఆడటం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది''
''బ్యాటింగ్‌లో పంత్ ఎక్స్ ఫ్యాక్టర్ అని అందరికీ తెలుసు. కానీ శస్త్రచికిత్స అనంతరం అదే తీవ్రతతో వికెట్ కీపింగ్ సామర్థ్యాన్ని తిరిగి తెచ్చుకోవడం పంత్ కష్టానికి నిదర్శనం. మృత్యువును జయించి విజయాలను సాధిస్తున్న పంత్ అతనికే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు ప్రేరణ. గొప్పగా పోరాడావు. అద్భుతం చేశావు. అదే రీతిలో కొనసాగించు'' అని రవిశాస్త్రి అన్నాడు.