28 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రతీకారం తీర్చుకున్నాడు, ఎవరీ పంత్
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన యువ క్రికెటర్ రిషబ్ పంత్ భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. కేరళలోని తుంబాలో జార్ఖండ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 48 బంతుల్లోనే 100 పరుగులు చేసి భారత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 28 ఏళ్ల రికార్డును బద్దలు చేశాడు.
ఈ సెంచరీతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీని సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తం 67 బంతుల్లో 13 సిక్సర్లు, 8 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 82 బంతుల్లో సెంచరీ సాధించిన పంత్ 117 (106 బంతుల్లో) వ్యక్తిగత పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.
ఈ సీజన్‌లో రిషబ్ పంత్ ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 146, 308, 24, 9, 60, 117, 135 పరుగులతో మొత్తం 799 పరుగులు చేశాడు. పంత్ బ్యాటింగ్ యావరేజి 133.16గా ఉండగా, స్ట్రయిక్ రేట్ 113.73 కావడం విశేషం. 1987-88 సీజన్‌లో జరిగిన ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియాపై తమిళనాడు క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ 56బంతుల్లో 100 పరుగులు చేశాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
ఈ సెంచరీయే ఇప్పటిదాకా రికార్డుగా కొనసాగింది. అంతకుముందు ఏడాది రాజేశ్ బోరా కూడా 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అయితే ప్రపంచ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం 19 ఏళ్ల రిషబ్ పంత్ సాధించిన ఫీట్ రెండో స్థానంలో నిలుస్తుంది. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ (1982)లో దక్షిణ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ హూక్స్ 34 బంతుల్లోనే ప్రత్యర్థి విక్టోరియాపై శతకం కొట్టి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో 67 బంతుల్లో 135 పరుగులు
ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా పంత్ 67 బంతుల్లో 135 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, 13 సిక్సర్లున్నాయి. సీజన్‌లో ఇప్పటికే ఇది నాలుగో సెంచరీ కాగా ఐదు మ్యాచుల్లో మొత్తం 44 సిక్సర్లు బాదాడు. దీంతో ఫాలో ఆన్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ చివరిదైన నాలుగో రోజు తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 480 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

గతేడాది అక్టోబర్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం
గతేడాది అక్టోబర్‌లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. నమీబియాతో సెంచరీ చేసి జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఆ మ్యాచ్ జరిగిన రోజే నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రూ.10 లక్షల కనీస ధర ఉన్న పంత్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏకంగా రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆ నిర్ణయం రిషబ్‌ను నిరాశ పరిచింది
అంతేకాదు ఐపీఎల్‌లోనూ ఓ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఈ సీజన్ ఆరంభంలో భారత-ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఈ సిరీస్‌కు సెలెక్టర్లు రిషబ్ పంత్‌ను ఎంపిక చేయలేదు. ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్ ‘ఎ' జట్టులో చోటు దక్కకపోవడం రిషబ్‌ను నిరాశపరిచింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పంత్ భారీగా పరుగులు సాధించి మరోసారి ఎవరూ తనను పక్కకు తప్పించేలా చేయకూడదని నిర్ణయించుకున్నట్టు గత నెలలో మహారాష్ట్రపై ట్రిపుల్ సెంచరీ చేసిన అనంతరం పంత్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications