
కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను ఇటీవల ముంబైకి తరలించిన సంగతి తెలిసిందే. అంబానీ ఆస్పత్రిలో చేరిన అతని గురించి తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. అతని మోకాలికి శస్త్రచికిత్స విజయవంతంగా చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. సెంటర్ ఫర్ స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్ డాక్టర్ దిన్‌షా పర్దీవాలా నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసినట్లు తెలిసింది.
కొత్త సంవత్సరానికి ముందు తల్లికి సర్‌ప్రయిజ్ ఇవ్వాలని అనుకున్న రిషభ్ పంత్.. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించడానికి పంత్ ప్రయత్నించాడు. ఈ సమయంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న ఒక బస్సు డ్రైవర్ వచ్చి పంత్‌ను కారులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స తీసుకున్న తర్వాత అతన్ని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆస్పత్రికి తరలించారు.
దీనిపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ''రిషభ్ పంత్ మోాకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయింది. ప్రస్తుతం అతను అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. తర్వాత అతనికి చేయాల్సిన చికిత్స, రీహాబిలేషన్ ప్లాన్‌ను డాక్టర్ దిన్‌షా పర్దీవాలా సూచిస్తారు. అనంతరం బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడికల్ టీం అతన్ని పర్యవేక్షిస్తుంది' అని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతానికైతే ఈ 25 ఏళ్ల క్రికెటర్ అబ్జర్వేషన్‌లో ఉన్నాడని వెల్లడించింది. పంత్‌కు జరిగిన ప్రమాదంపై పలువురు మాజీలు, తోటి క్రికెటర్లు స్పందించిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరగడం మంచి విషయం కాకపోయినా.. ఈ సమయాన్ని పంత్ తన కోసం ఉపయోగించుకోవాలని, తన ఆట గురించి ఆలోచించుకుంటే మంచిదని కొందరు మాజీలు సలహా ఇస్తున్నారు. ఈ ప్రమాదం జరగడానికి ముందు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ పెద్దగా రాణించలేదన్న సంగతి తెలిసిందే.