రాంచీ: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చిన టీమిండియా ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. బిజీబిజీ షెడ్యూల్లో కూడా దొరికిన కాస్త విరామాన్ని సరదాగా ఆస్వాదిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ దంపతులతో యువవికెట్ కీపర్ రిషభ్ పంత్ చిల్ అవుతున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. మహీకి వీరాభిమాని అయిన పంత్.. అతనితో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌ను ధోనీ భార్య సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫొటోలో సన్నిహితులతో ధోనీ, సాక్షి వీడియో కాల్లో మాట్లాడుతుండగా.. పంత్ చిరునవ్వుతో వాళ్లని పలకరిస్తున్నాడు.
రిషభ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా తనకి మద్దతిస్తున్న అభిమానులకు అతడు ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో పంత్ వివిధ జెర్సీలు ధరించిన ఫొటోలు ఉన్నాయి. టీమిండియా టెస్టు, పరిమిత ఓవర్ల ఫార్మాట్ జెర్సీలతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలతో పాటు 'స్పైడర్ మ్యాన్' జెర్సీ ఉండటం గమనార్హం. గబ్బా టెస్టులో పంత్ హిందీ వెర్షన్లో స్పైడర్ మ్యాన్ పాటను పాడాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అప్పటి నుంచి పంత్‌ను 'స్పైడర్ పంత్'గా నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.
రిషభ్ పంత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో వృద్ధిమాన్ సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. రెండో టెస్టులో మోస్తరుగా రాణించాడు. ఇక సిడ్నీ టెస్టులో భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను తన దూకుడు బ్యాటింగ్‌తో విజయం వైపు నడిపించాడు. ఆ మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన అతడు త్రుటిలో శతకం చేజార్చుకొని ఔటయ్యాడు. ఒకవేళ ఔటవ్వకుండా అలాగే బ్యాటింగ్ చేసి ఉంటే.. ఆ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించే అవకాశం ఉండేది.
ఇక గబ్బా టెస్టులో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్న వేళ చేటేశ్వర్ పుజారా (56), వాషింగ్టన్ సుందర్ (22)తో కలిసి రిషభ్ పంత్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే చివర్లో మరింత దూకుడుగా ఆడిన పంత్.. 89 పరుగులు చేసి భారత్‌కు అపురూప విజయం అందించాడు. పంత్ టీమిండియా తరపున ఇప్పటివరకు 16 టెస్టుల్లో 1088, 16 వన్డేల్లో 374, 28 టీ20ల్లో 410 పరుగులు సాధించాడు. సిడ్నీ, బ్రిస్బేన్లలో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న పంత్.. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి ఎగబాకాడు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. భారత్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం రూట్ సేన బుధవారం చెన్నై రానుంది.
36 పరుగులకు ఆలౌట్ అవ్వగానే.. గంగూలీ నుంచి కాల్ వచ్చింది: రహానే