స్టార్ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ అతి త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్టుగా సంకేతాలు పంపుతున్నాడు. తాజాగా బెంగళూరులో భారత జట్టుతో కలిసి ఉన్నాడు. అంతేగాక ఎన్సీఏ త్రో స్పెషలిస్టులతో చిన్నస్వామి స్టేడియంలో గంటపాటు నెట్స్‌లో పంత్ ప్రాక్టీస్ చేశాడు. అనంతరం భారత ఆటగాళ్లతో కలిసి మైదానంలో కబురులు చెప్పాడు.
2022 డిసెంబర్‌లో కారు ప్రమాదంలో గాయపడిన పంత్ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. మొదట్లో నడవడానికి శ్రమించిన పంత్ ఇప్పుడు నెట్స్‌లో సాధన చేసేలా సిద్ధమయ్యాడు. అయితే జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు పంత్ అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ ఐపీఎల్‌లో తిరిగి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతడు ఫిట్‌నెస్ సాధిస్తాడనే నమ్మకంతో వచ్చే సీజన్‌లో తమ జట్టు కెప్టెన్ బాధ్యతలు పంత్ తీసుకుంటాడని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది.

అయితే ఐపీఎల్‌లో పంత్ ఆడాలంటే ఎన్సీఏ, బీసీసీఐ నుంచి క్లియరెన్స్ రావాలి. జూన్‌లోనే టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో పంత్ విషయంలో బీసీసీఐ జాగ్రత్త వహిస్తుంది. ఒకవేళ ఐపీఎల్‌లో ఆడటానికి అనుమతి లభించి, ఫర్వాలదేనిపించే ప్రదర్శన చేసిన పంత్ టీ20 ప్రపంచకప్ జట్టులోకి తప్పక వచ్చేస్తాడు. విధ్వంసకరంగా బ్యాటింగ్ చేసే సత్తా, ఎడమచేతి వాటం.. పంత్‌కు ప్రధాన బలంగా మారాయి. గేమ్ ఛేంజర్ అయిన పంత్ ఒక్కకాలితో ఉన్న టీ20 ప్రపంచకప్‌లో ఆడించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఇటీవల పేర్కొనడం విశేషం.
మరోవైపు పంత్ వేగంగా కోలుకోవడంతో సెలక్టర్లుకు తలనొప్పిగా మారింది.పంత్ గైర్హాజరీలో వన్డే, టెస్టుల్లో కేఎల్ రాహుల్‌ను ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. టీ20ల్లో ఇషాన్ కిషన్, సంజు శాంసన్, జితేశ్ శర్మకు వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చారు. అయితే టీ20 ఫార్మాట్‌లో రాహుల్‌కు సెలక్టర్లకు మొండిచేయి చూపిస్తూ అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఎంపికచేయలేదు. మరోవైపు ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో దూరమై జట్టుకు అందుబాటులో లేడు. ఈ దశలో జితేశ్ శర్మతో సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. కానీ పంత్ తిరిగొస్తే ఈ నలుగురు స్థానాలకు ప్రమాదమే ఏర్పడుతుంది.
ఏడాది పాటు దూరమైనా పంత్ ప్రధాన వికెట్ కీపర్‌గా టీ20 ప్రపంచకప్‌లో చోటు సంపాదిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాకప్ కీపర్ స్థానం కోసం రాహుల్, శాంసన్, ఇషాన్, జితేశ్ శర్మ పోటీపడతారని చెబుతున్నారు. ఐపీఎల్‌లో ఆ నలుగురి ప్రదర్శన ఆధారంగా ఒక్కరికి మాత్రమే అవకాశం వస్తుందని అంటున్నారు. జూన్‌లో జరిగే ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.