
ఐపీఎల్‌తో మొదలు..
ఈ ఏడాదిలో పంత్ కాంట్రవర్సీలు ఐపీఎల్‌తో మొదలయ్యాయి. ఢిల్లీ, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచులో పంత్ ప్రవర్తన వివాదాస్పదం అయింది. చివరి ఓవర్లో రాజస్థాన్ పేసర్ ఓబెడ్ మెకాయ్ వేసిన బంతి నోబాల్ అని ఢిల్లీ క్యాంప్ భావించింది. కానీ అంపైర్లు నోబాల్ ఇవ్వలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన పంత్.. క్రీజులో ఉన్న ఢిల్లీ ఆటగాళ్లను తిరిగి వచ్చేయాలంటూ సైగలు చేశాడు. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ ఆమ్రే అయితే మైదానంలోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడాడు. దీంతో చికాకు పడిన అంపైర్లు అతన్ని వెనక్కు పంపేశారు. ఈ ఘటనతో ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పంత్, ఆమ్రేకు వంద శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించారు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో..
ఐపీఎల్ ముగిసిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఒక్కటంటే ఒక్క వైట్ బాల్ మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. పేలవ ఫామ్‌లో ఉండటంతో అతన్ని ఆసియా కప్‌లో కూడా పెద్దగా ఆడించలేదు. చివర్లో టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఎక్కువ మ్యాచుల్లో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. లీగ్ దశలో చివరి మ్యాచ్, సెమీఫైనల్ ఆడాడు. ఈ మ్యాచుల్లో కూడా రాణించలేదు. ఆ తర్వాత న్యూజిల్యాండ్ పర్యటనలో అయితే అత్యంత ఘోరమైన ప్రదర్శన చేశాడు. టీ20, వన్డే సిరీసులు రెండింట్లో విఫలమయ్యాడు. టెస్టుల్లో రాణించినా.. వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం ఘోరమైన రికార్డులు మూటగట్టుకున్నాడు.

ఊర్వశీ రౌతేలా కాంట్రవర్సీ..
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాతో పంత్ కాంట్రవర్సీ నెట్టింట పెద్ద దుమారమే రేపింది. ఒక ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఊర్వశి.. 'ఆర్‌పీ' అనే వ్యక్తి తనకోసం గంటల తరబడి హోటల్‌లో వెయిట్ చేశాడని చెప్పింది. పంత్, ఊర్వశి డేటింగ్ చేసినట్లు గతంలో వదంతులు రావడంతో ఆమె పంత్ గురించే మాట్లాడిందని అంతా అనుకున్నారు. దీనిపై స్పందించిన పంత్.. 'ఫేమ్ కోసం కొందరు ఎంత దిగజారుతారో' అని ఇన్‌స్టాగ్రాంలో ఒక పోస్టు కూడా పెట్టి డిలీట్ చేశాడు. దీనిపై స్పందించిన ఊర్వశి.. నీ ఆట నువ్వు ఆడుకో తమ్ముడూ అంటూ సెటైర్లు వేసింది.

టీ20 వరల్డ్ కప్ టైంలో..
ఊర్వశీ రౌతేలా కాంట్రవర్సీ తర్వాత ఆమె ఒక విధంగా పంత్‌ను వెంటాడుతూనే ఉంది. ఆసియా కప్‌లో భారత్ ఆడిన మ్యాచులు చూసేందుకు ఆమె వెళ్లింది. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో కూడా మెరిసింది. ఇదంతా పంత్‌ను బాధించేందుకే అని ఫ్యాన్స్ భావించారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో పంత్‌ను ఎగతాళి చేస్తూ రాక్షసానందం పొందారు. టీ20 వరల్డ్ కప్‌లో బౌండరీ రోప్ దగ్గర పంత్ ఉండగా.. 'పంత్.. నిన్ను ఊర్వశి పిలుస్తోంది' అంటూ ఎగతాళి చేశారు. అప్పట్లో ఈ గొడవ చాలా పెద్ద దుమారం రేపింది.

హర్ష భోగ్లేపై పంత్ ఆగ్రహం
కివీస్‌తో సిరీస్ మధ్యలో సీనియర్ కామెంటేటర్ హర్ష భోగ్లేతో పంత్ ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా పెద్ద గొడవకు దారి తీసింది. టెస్టుల్లో పంత్ అదరగొడుతున్నాడని, కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని రికార్డు పెద్దగా బాగలేదని భోగ్లే అన్నాడు. అసలు ఆ రెంటినీ పోల్చకూడదని, తను ఇంకా చిన్న పిల్లాడినేని పంత్ అన్నాడు. తనకు 30-32 ఏళ్ల వయసు వచ్చినప్పుడు పోలికలు చేయాలన్నాడు. అతను అన్న మాటలు తప్పు కాకపోయినా.. అతని టోన్ మాత్రం ఎవరికీ నచ్చలేదు. ఈ విషయంలో పంత్‌ను దూషిస్తూ చాలా మంది నెట్టింట కామెంట్లు చేశారు.

శ్రీలంక సిరీస్‌కు తప్పించారా?
ఈ గొడవలన్నీ జరుగుతుండగానే వచ్చే ఏడాది జరిగే శ్రీలంక టూర్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీ20, వన్డే సిరీసులు రెంటికీ పంత్‌ను ఎంపిక చేయలేదు. అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదనే విషయంలో బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే పంత్‌కు చిన్న గాయమైందని, ఫిట్‌నెస్ కోసం ఎన్సీయేకు అతను వెళ్లాల్సి ఉందని వార్తలు వచ్చాయి. కానీ చాలా మంది మాత్రం పంత్ పేలవ ఫామ్‌లో ఉండటంతోనే అతన్ని జట్టు నుంచి తప్పించారని భావించారు. ఈ గొడవలన్నీ మర్చిపోయి కొత్త ఏడాదిని అతను కొత్తగా ఆరంభించాలని అనుకుంటుండగా.. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై యాక్సిడెంట్ జరిగింది. దీనిలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను కోలుకోవడానికి ఆరు నెలలు పట్టొచ్చని సమాచారం. ఇవన్నీ చూస్తుంటే 2022వ సంవత్సరం పంత్‌కు పెద్దగా అచ్చొచ్చినట్లు కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications












