టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భారత్.. రేపు కీలక మ్యాచ్ ఆడబోతోంది. డూ ఆర్ డై గేమ్ ఇది. కోల్ కతలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ తో తలపడబోతోంది. సెమీ ఫైనల్స్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. సూపర్ 8లో తొలుత న్యూజిలాండ్ చేతిలో చిత్తయినా అనంతరం జింబాబ్వేను ఓడించిన అనంతరం రేసులోకి దూసుకొచ్చింది టీమిండియా. ఇందులో గెలిస్తే సెమీ ఫైనల్స్ కోసం రెడ్ కార్పెట్ పరిచినట్టే అవుతుంది.
కీలకమైన ఈ మ్యాచ్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ అందుబాటులోకి రాబోతోన్నాడు. వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరుకు ముందు అతను భారత జట్టులో తిరిగి చేరనున్నాడు. తండ్రి మరణించిన మూడోరోజే అతను జట్టుతో మళ్లీ కలవడం విశేషం. తన స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ నుంచి ఈ సాయంత్రం రింకూ సింగ్ నేరుగా కోల్‌కతాకు బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడే అతను భారత జట్టుతో కలుస్తాడు.

రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ కాలేయ క్యాన్సర్‌తో శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నెల 21న ఆయన ఆరోగ్యం విషమించడంతో గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడానికి రింకూ శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు చెన్నై నుంచి న్యూఢిల్లీకి బయలుదేరారు.
అంతకుముందు కూడా తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు రింకూ సింగ్ ఇంటికి వెళ్లాడు. తండ్రి చివరి రోజుల్లో ఆయన వద్దే గడిపాడు. ఆ తర్వాత వెంటనే భారత్, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌కి ముందు జట్టులో తిరిగి చేరాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో రింకూకు తుది జట్టులో అవకాశం లభించలేదు. ఫలితంగా ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు. అతని స్థానంలో సంజు శాంసన్‌కు జట్టు మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది.
సంజు శాంసన్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. రింకూ ఆడకపోయినప్పటికీ, జట్టుతో అతని అనుబంధం కొనసాగింది. ఇప్పుడు ముఖ్యమైన మ్యాచ్ షెడ్యూల్‌కు ముందు మళ్లీ టీమ్ ఇండియాలో చేరనున్నాడు. ఈ టోర్నమెంట్ లో అతను పెద్దగా రాణించట్లేదు. లీగ్స్ లో విఫలం అయ్యాడు. సూపర్ 8 లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. ఇప్పటివరకు ఆడిన అయిదు ఇన్నింగ్ లల్లో 24 పరుగులు మాత్రమే చేశాడు.