మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి 86 పరుగుల పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీస్కోర్ చేసింది.
అయితే భారత్ ఓ దశలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్(53; 29 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు).. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(74; 34 బంతుల్లో, 4 ఫోర్లు, 7 సిక్సర్లు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆఖర్లో హార్దిక్ పాండ్య (32; 19 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింద.ి

బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ మూడు, తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులకే పరిమితమైంది. మహ్మదుల్లా(41; 39 బంతుల్లో, 3 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.
కాగా, మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మాట్లాడాడు. ఒత్తిడిలో తాను గొప్ప ఇన్నింగ్స్ ఆడటానికి కారణం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ అని తెలిపాడు. వాళ్లు ఇచ్చిన సలహాతోనే ఇన్నింగ్స్ నిర్మించగలిగానని అన్నాడు. అయితే వారు చెప్పిన కేవలం ఒక్క మాటే అని రింకూ తెలిపాడు. 'స్వేచ్ఛగా ఆడు, ప్రతి బాల్ హిట్టింగ్ చెయ్యి' అని సూచించారని నయా ఫినిషర్ చెప్పాడు.
''పరిస్థితులు ఎలా ఉన్నా నా ఆట నన్ను ఆడమని కోచ్, కెప్టెన్ చెప్పారు. జస్ట్.. ప్రతి బాట్ హిట్టింగ్ చెయ్యి అన్నారు. నా సామర్థ్యాన్ని విశ్వసిస్తూ ప్రతి బంతిని బాదాను. గంభీర్ భాయ్ నాకు ఈ స్వేచ్ఛను ఇచ్చాడు. నా బ్యాటింగ్ ఆర్డర్‌పై ఎలాంటి క్లారిటీ ఉండదు. ఏ సమయంలో అయినా రావాల్సి ఉంటుంది. వికెట్లు త్వరగా పడిన సమయంలో నేను క్రీజులోకి వస్తే.. సింగిల్స్, డబుల్స్‌కు ట్రై చేస్తూ చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తా''
''డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తే బౌండరీలు, సిక్సర్లు బాదుతూ వీలైనంతగా ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తా. ఇక నాకెలాంటి ఆందోళన లేదు. మా టీమ్ ఆడే విధానం వల్ల మ్యాచ్ త్వరగా ముగుస్తుంది. గెలవడమే మాకు ముఖ్యం. ఇక రంజీ ట్రోఫీకి సన్నద్ధమయ్యే సమయం నాకు లేదు. అక్టోబర్ 12న ఆఖరి టీ20. కొన్ని రోజులే దొరుకుతున్నాయి. వైట్ బాల్ ఆడిన తర్వాత వెంటనే రెడ్ బాల్ క్రికెట్ ఆడటం అంత సులువుకాదు. లక్నోకు వెళ్లిన తర్వాత నెట్స్‌లో మరింతగా సాధన చేస్తాను. మూడు ఫార్మాట్లకు ఆడే సత్తా ఉంది. అవకాశం వస్తే నిరూపించుకుంటా'' అని రింకూ సింగ్ పేర్కొన్నాడు.