Rinku Singh: ఆస్ట్రేలియాతో త్వరలో జరగబోయే కీలకమైన టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ దేశీయ క్రికెట్‌లో తన సత్తాను చాటాడు. కాన్పూర్‌లో జరిగిన రంజీ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడిన రింకూ.. ఆంధ్ర జట్టుపై అసాధారణమైన పోరాట పటిమతో అజేయంగా 165 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మెగా ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇది కేవలం యూపీ జట్టును కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు ముందు రింకూ అద్భుతమైన ఫామ్‌ను భారత క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు స్పష్టంగా చాటి చెబుతోంది.
కష్టాల్లో కూరుకుపోయిన జట్టుకు రింకూ భరోసా
మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 470 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీనికి బదులివ్వడంలో యూపీకి దారుణమైన ప్రారంభం లభించింది. ఒకానొక దశలో యూపీ జట్టు కేవలం 178 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి అత్యంత క్లిష్టమైన సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్ ఓపికతో, పట్టుదలతో క్రీజులో నిలబడ్డాడు. రింకూ సింగ్ దాదాపు 260కి పైగా బంతులు ఎదుర్కొని ఆంధ్ర బౌలర్ల వ్యూహాలను చిత్తు చేశాడు. రింకూ ఈ ఇన్నింగ్స్ కేవలం భారీ షాట్లకే పరిమితం కాకుండా, వికెట్‌ను కాపాడుకోవడానికి, జట్టును పతనం నుంచి నిలబెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.

నిగమ్‌తో కీలక భాగస్వామ్యం,, యూపీకి ఉపశమనం
రింకూ సింగ్‌కు మరో యువ ఆటగాడు విప్రజ్ నిగమ్ (42 పరుగులు) నుంచి అద్భుతమైన సహకారం లభించింది. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్ కోసం 122 పరుగుల అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ విలువైన భాగస్వామ్యం కారణంగానే ఉత్తరప్రదేశ్ జట్టు చివరికి 450 పరుగుల మార్కును దాటగలిగింది. మ్యాచ్‌లో తమ పోరాటాన్ని కొనసాగించగలిగింది. ఈ సెంచరీతో రింకూ సింగ్ తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 3400 కంటే ఎక్కువ పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతని సగటు 55 కంటే ఎక్కువగా ఉంది. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఇది అతని 8వ సెంచరీ కావడం విశేషం. రింకూ సింగ్ 22 అర్ధ సెంచరీలు కూడా నమోదు చేశాడు.
ఆస్ట్రేలియాకు గట్టి వార్నింగ్!
ఈ ఇన్నింగ్స్ ఆడిన సమయం టీమిండియాకు చాలా అనుకూలంగా ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేకపోవడంతో, జట్టుకు ఒక నమ్మకమైన 'ఫినిషర్' అవసరం ఉంది. ఇలాంటి కీలక సమయంలో రింకూ సింగ్ దేశీయ క్రికెట్‌లో చూపిన ఈ అద్భుతమైన ప్రదర్శన, టీమ్ మేనేజ్‌మెంట్‌కు గొప్ప భరోసా ఇచ్చింది. రింకూ ఇప్పుడున్న ఫామ్ చూస్తుంటే, ఆస్ట్రేలియా జట్టు రాబోయే టీ20 సిరీస్‌లో అతన్ని ఎదుర్కోవడానికి కచ్చితంగా ప్రణాళికలు మార్చుకోవాల్సి వస్తుంది.