టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 దశలో టీమిండియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ రాక జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులు జట్టుకు దూరమైన రింకూ సింగ్.. గురువారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరగనున్న చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలై సెమీస్ ఆశలు సంక్లిష్టమైన వేళ.. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫినిషర్ జట్టుతో చేరడం భారత జట్టుకు భారీ ఊరట.
తండ్రి ఆరోగ్యంపై ఆందోళన
రింకూ సింగ్ అర్ధాంతరంగా టోర్నమెంట్ వదిలి భారత్‌కు రావడానికి కారణం ఆయన తండ్రి ఖాన్ చంద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి. ఆయన ప్రస్తుతం స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తండ్రిని పరామర్శించేందుకు.. కుటుంబానికి అండగా ఉండేందుకు రింకూ అత్యవసరంగా గ్రేటర్ నోయిడాకు చేరుకున్నాడు. తండ్రి ఆరోగ్యం కొంత స్థిమితంగా ఉండటంతో.. దేశం కోసం మళ్లీ ఆడేందుకు ఆయన ఢిల్లీ నుంచి చెన్నైకి విమానంలో బయలుదేరాడు. వ్యక్తిగత బాధను పక్కనపెట్టి రింకూ జట్టు కోసం రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జింబాబ్వేపై తిరుగులేని రికార్డు
జింబాబ్వే జట్టుపై రింకూ సింగ్‌కు అద్భుతమైన గణాంకాలు ఉన్నాయి. గతంలో ఆ జట్టుతో ఆడిన ఐదు టీ20లలో రింకూ 176.47 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. ముఖ్యంగా 2024లో హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆయన ఆడిన 48 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. లోయర్ ఆర్డర్‌లో వచ్చి వేగంగా పరుగులు రాబట్టడంలో సిద్ధహస్తుడైన రింకూ.. జింబాబ్వే బౌలర్లను గతంలోనే సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
టీమిండియా సెమీస్ ఆశలు.. రింకూ పాత్ర
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సెమీఫైనల్‌కు చేరాలంటే కేవలం గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్‌ను కూడా భారీగా మెరుగుపరుచుకోవాలి. జట్టులో చాలామంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నప్పటికీ, ఫినిషర్‌గా రింకూ సింగ్ ఇచ్చే భరోసా వేరు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రింకూ డకౌట్ అయినప్పటికీ, ఒత్తిడిలో అద్భుతమైన సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం ఆయనకు ఉంది. జింబాబ్వేపై భారత్ భారీ విజయం సాధించడంలో రింకూ మెరుపులు అత్యవసరమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.