టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఎదుర్కొన్న పరాజయం జట్టు ఎంపికపై అనేక సందేహాలను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరిస్తున్న వ్యూహాలను తప్పుబట్టారు. కేవలం ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లను బట్టి జట్టులో మార్పులు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు రావని.. ఇది టీమ్ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఒత్తిడి ఉన్న సమయంలో ప్రయోగాల కంటే అత్యుత్తమ ఆటగాళ్లపై నమ్మకం ఉంచడమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడంపై అసహనం
గత మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తుది జట్టులో తీసుకోకపోవడాన్ని రికీ పాంటింగ్ తీవ్రంగా విమర్శించారు. ప్రత్యర్థి జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారనే కారణంతో అక్షర్‌ను పక్కన పెట్టి, వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడం సరైన నిర్ణయం కాదని ఆయన పేర్కొన్నారు. ఒకే ఒక మార్పు వల్ల టోర్నమెంట్ తలరాత మారిపోదని, అక్షర్ వంటి కీలక ఆటగాడిని పక్కన పెట్టడం వల్ల జట్టులో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని పాంటింగ్ విశ్లేషించారు. పరిస్థితులకు అనుగుణంగా బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ముందే నిర్ణయించుకోవాలని సూచించారు.

కుల్దీప్, అక్షర్ పాత్ర కీలకం
చెన్నైలో జింబాబ్వేతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని రికీ పాంటింగ్ సూచించారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవడం అత్యవసరమని ఆయన అన్నారు. బ్యాటర్ ఎడమచేతి వాటమా లేక కుడిచేతి వాటమా అన్న దానితో సంబంధం లేకుండా ఏ బ్యాటర్నయినా బోల్తా కొట్టించే నైపుణ్యం కుల్దీప్‌కు ఉందని గుర్తు చేశారు. అలాగే బ్యాటింగ్ లోతును పెంచడం కోసం బౌలింగ్ బలాన్ని తగ్గించుకోవద్దని.. టాప్-7 బ్యాటర్లే బాధ్యత తీసుకుని మ్యాచ్‌ను గెలిపించాలని ఆయన స్పష్టం చేశారు.
తేలికపాటి వాతావరణం అవసరం
డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలని గంభీర్‌కు పాంటింగ్ సలహా ఇచ్చారు. టీమిండియాలో అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని.. అనవసరమైన ఆందోళనలకు పోకుండా సహజసిద్ధమైన ఆట ఆడితే భారత్ ఖచ్చితంగా పుంజుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంపికలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల కంటే.. మైదానంలో బౌలర్లను కెప్టెన్ ఎలా ఉపయోగిస్తాడు అనేదే గెలుపోటములను శాసిస్తుందని పాంటింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.