
ఈ ఏడాది ఐపీఎల్ అందరికీ మరింత ఉత్సాహం పంచేందుకు రెడీ అవుతోంది. దీనికి ప్రధాన కారణం కొత్తగా ఈ లీగ్‌లో తీసుకొచ్చిన రూల్సే. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన రూల్ ఏదైనా ఉందంటే.. అది ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనే. మ్యాచ్ మొదలయ్యే సమయంలోనే ఐదుగురు ఆటగాళ్ల పేర్లను సబ్‌స్టిట్యూట్లుగా కెప్టెన్లు వెల్లడిస్తారు. మ్యాచ్ మధ్యలో పరిస్థితిని బట్టి వీరిని మైదానంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ రూల్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తన అభిప్రాయం వెల్లడించాడు.
'ఈ రూల్ వల్ల ఆటలో ఆల్‌రౌండర్ల అవసరం లేకుండా పోతుంది. కేవలం వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు అయితేనో.. లేదంటే కేవలం బ్యాటర్‌గా లేక బౌలర్‌గా తీసుకుంటేనే వాళ్లకు జట్టులో చోటు దక్కుతుంది. అంతేకానీ అటు కొంచెం, ఇటు కొంచెం ఉంటే అవకాశం దక్కదు. ఈ లెక్కన చూసుకుంటే చాలా జట్లు ఈ ఏడాదిలో ఏడో నెంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ.. అవసరమైతే రెండు ఓవర్లు బౌలింగ్ చేసే ఎవర్నీ ఆడించవు. ఎందుకంటే అలాంటి వాళ్ల అవసరం ఏముంది?' అని పాంటింగ్ ప్రశ్నించాడు.
అక్కడితో ఆగని పాంటింగ్.. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గురించి లోతుగా విశ్లేషించాడు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలా? లేదా బౌలింగ్ చేయాలా? అని నిర్ణయించుకున్నప్పుడే.. ఏ ఆటగాళ్లను ఇంపాక్ట్ ప్లేయర్‌గా పిలవాలో డిసైడ్ అవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాబట్టి కెప్టెన్లు రెండు వేరు వేరు జట్లతో టాస్‌కు వస్తారని చెప్పాడు. ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఒక జట్టు, బౌలింగ్ చేయాలంటే మరో జట్టును ప్రకటిస్తారని వెల్లడించాడు.
'ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఎలా వాడుకుంటాం అనేది ముందుగా బ్యాటింగ్ చేస్తున్నామా? లేక బౌలింగ్ చేస్తున్నామా? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి టాస్ సమయంలోనే మొదట బ్యాటింగ్ చేసే టీం, బౌలింగ్ చేసే టీం వేరు వేరుగా రెడీ చేసుకుంటాం. ముందుగా బ్యాటింగ్ చేస్తుంటే అదనంగా ఒక బ్యాటర్‌ను తీసుకుంటాం. అదే మ్యాచ్ మొదలవగానే వికెట్ పడితే.. ఆ వెంటనే ఒక బ్యాటర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ రూల్ వాడుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు.