అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ షోతో కంగారూలను కంగారు పెట్టించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాస్ పరాజయాన్ని మరిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
ఎన్నో ప్రతికూలతల మధ్య భారత్ పెర్త్ టెస్టును ఆడి గెలిచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ జట్టుకు దూరమైనా, ఆటగాళ్లు అంతగొప్పగా ఫామ్‌లో లేకపోయినా.. స్టాండ్‌బై కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా హయంలో భారత జట్టు విజయాన్ని అందుకుంది. బుమ్రా ఎనిమిది వికెట్లతో, యశస్వీ జైస్వాల్ (161), విరాట్ కోహ్లి (100 నాటౌట్) సెంచరీలతో విజయంతో ప్రధాన పాత్ర పోషించారు.

అయితే పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోతుందని, అసలు టీమిండియా గెలుస్తుందని ఊహించలేదని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇది సరికొత్త భారత్ అని కొనియాడాడు. స్వదేశాల్లో కంటే విదేశాల్లోనే అత్యుత్తమ ఆడే జట్టుగా ఎదిగిందని ప్రశంసించాడు. పెర్త్ టెస్టు విజయమే దానికి ఉదాహరణ అని తెలిపాడు. అయితే దాదాపు 300 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసిన ఆస్ట్రేలియాను ఈ ఓటమి తీవ్రంగా బాధిస్తుందని పాంటింగ్ అన్నాడు.
పెర్త్ టెస్టులో తొలి రోజు.. టాస్ గెలిచి తొలుత టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణయం గురించి ఎంతో మంది తన అభిప్రాయాన్ని అడగ్గా, అది సరైన నిర్ణయమని తెలిపానని పాంటింగ్ పేర్కొన్నాడు. పెర్త్ వేదికగా గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించిందని, గణాంకాల ప్రకారం వెళ్లడమే సరైనదిగా భావించానని చెప్పాడు. 150 పరుగులకే ఆలౌటైనప్పటికీ బుమ్రా, సిరాజ్, రాణా అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారని అన్నాడు. నితీశ్ రెడ్డి కూడా చక్కగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. క్రెడిట్ భారత బౌలర్లకు ఇవ్వాలని పాంటింగ్ అన్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు భారత్, 104 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను టీమిండియా 487/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 534 పరుగుల కొండంత లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 58.4 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. కాగా, డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తలపడనుంది. పింక్ బాల్‌తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.