ఫీల్డింగ్ చేశావా? ఫిలిం చూశావా?: పాంటింగ్ రియాక్షన్ మామూలుగా లేదుగా!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ మైదానంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్, ప్లేయర్ శశాంక్ సింగ్ మధ్య జరిగిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది.
ఫీల్డింగ్‌లో శశాంక్ సింగ్ తడబాటు
న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో లక్నో జట్టు తడబడినప్పటికీ.. పంజాబ్ ఫీల్డర్ శశాంక్ సింగ్ చేసిన తప్పులు చర్చకు దారితీశాయి. ఒకే మ్యాచ్‌లో మూడుసార్లు ఫీల్డింగ్‌లో పొరపాట్లు చేసిన శశాంక్.. సులువైన క్యాచ్‌లను వదిలేశాడు. ముఖ్యంగా 18వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఐడెన్ మార్‌క్రమ్ ఇచ్చిన క్యాచ్‌ను శశాంక్ సింగ్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. బంతిని అందుకునే ప్రయత్నం చేయకుండా అది బౌండరీ అవతలకు వెళ్లడాన్ని చూస్తూ ఉండిపోయాడు.

కోపంతో ఊగిపోయిన రికీ పాంటింగ్, అర్ష్‌దీప్ సింగ్
శశాంక్ సింగ్ వరుసగా క్యాచ్‌లు వదిలేయడం చూసి డగౌట్లో ఉన్న కోచ్ రికీ పాంటింగ్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఎంతో క్రమశిక్షణను కోరుకునే రికీ పాంటింగ్.. శశాంక్ సింగ్ వైఖరి చూసి షాక్‌కు గురయ్యాడు. అటు బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా మైదానంలోనే తన కోపాన్ని ప్రదర్శించాడు. ఒకే ఓవర్ తర్వాత ముకుల్ చౌదరి ఇచ్చిన మరో సులువైన క్యాచ్‌ను కూడా శశాంక్ సింగ్ జారవిడచడంతో కామెంటేటర్లు కూడా దీనిని ఫీల్డింగ్ డిజాస్టర్ అని అభివర్ణించారు.
చివర్లో అక్కున చేర్చుకున్న కోచ్ రికీ పాంటింగ్
మ్యాచ్ సమయంలో ఎంత కోపం ప్రదర్శించినా.. గెలుపు తర్వాత మాత్రం రికీ పాంటింగ్ తనలోని అసలైన గురువును ప్రదర్శించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే శశాంక్ సింగ్ దగ్గరకు వెళ్లిన రికీ పాంటింగ్.. శశాంక్ సింగ్‌ను ఆత్మీయంగా కౌగిలించుకుని ఓదార్చాడు. తప్పులు చేయడం సహజమని, వాటిని అధిగమించాలని సూచిస్తూ నవ్వుతూ పలకరించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా శశాంక్ సింగ్ భుజంపై చేయి వేసి నవ్వుతూ అతడిని ఉత్సాహపరిచాడు. ఆటలో భావోద్వేగాలు సహజమని, మైదానంలో ఉండే కోపం మైదానంలోనే వదిలేయాలనే క్రీడా స్ఫూర్తిని రికీ పాంటింగ్ మరోసారి చాటిచెప్పాడు. పంజాబ్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications