
ప్రాక్టీస్ కావాలంటే
సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండో దశ టోర్నీ ఆరంభం కానున్న నేపథ్యంలో రికీ పాంటింగ్ మాట్లాడాడు. 'ఐపీఎల్ 2021 తొలి దశ టోర్నీలో ఆడిన తర్వాత మూడు నాలుగు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మళ్లీ మ్యాచ్ ప్రాక్టీస్ కావాలంటే కచ్చితంగా ఐపీఎల్ రెండో దశ టోర్నీలో ఆడాలి. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లు ఈ లీగ్ బరిలో ఉంటారు. ఈ అనుభవం అక్టోబర్ 17న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌కు ఎంతో ముఖ్యం. యూఏఈలో పరిస్థితులు టీ20 ప్రపంచకప్‌కు వేదికైన భారత్‌ను పోలి ఉంటాయి' అని పాంటింగ్ తెలిపాడు.

ఫించ్ తప్ప
గాయం కారణంగా ఆరోన్ ఫించ్ ఇప్పటికే ఐపీఎల్ 2021 రెండో దశ టోర్నీకి దూరం కాగా.. డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, రిలీ మెరిడీత్, డాన్ క్రిస్టియన్, మొయిసెస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై, జోష్ ఫిలిప్, నాథన్ కౌల్టర్ నీల్, క్రిస్ లిన్, బెన్ కటింగ్ ఐపీఎల్ జట్లలో ఉన్నారు. వీరిలో మార్ష్, ఫిలిప్ తొలి విడత ఐపీఎల్‌లో ఆడలేదు.
రెండో దశలో వారు బరిలోకి దిగనున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఐపీఎల్ ఆడేందుకు తమ ఆటగాళ్లకు అనుమతి ఇచ్చింది. బయో బుడగలో కరోనా కేసులు రావడంతో ఈ మే 4న ఐపీఎల్-14ను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ టోర్నీలో ఇంకా 76 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

సగం మంది మాత్రమే
ఐపీఎల్ 2021 రెండో దశ సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు ద్వైపాక్షిక సిరీసులు ఉన్నాయి. వ్యక్తిగత, ఇతర కారణాలతో వాటికి అందుబాటులో ఉండలేమని కొందరు ఆటగాళ్లు ఇప్పటికే చెప్పేశారు. దాదాపు 20 మంది ఐపీఎల్ ఆటగాళ్లలో.. సగం మంది మాత్రమే బంగ్లాదేశ్, వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్నారు. డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, క్రిస్ లిన్, నాథన్ కౌల్టర్-నైల్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ 2021 పార్ట్ -2లో ఆడనున్నారు. వీరితో పాటు జే రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్, డేనియెల్ సామ్స్ కూడా ఐపీఎల్‌కు వస్తారని తెలిసింది.

పునరాలోచనలో సీఏ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ యూఏఈలో జరుగుతుండటంతో ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) సైతం ఆలోచనలో పడిందని సమాచారం. ఐపీఎల్ 2021లో ఆడే ఆటగాళ్లను అడ్డుకోకుండా ఉండటమే మంచిదని భావిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్ అనుభవం మెగా టోర్నీకి ఉపయోగపడుతుందని సీఏ భావిస్తోంది. ఇక దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఆటగాళ్లు ఐపీఎల్ 2021 ఆడేందుకు వస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఐపీఎల్ కోసం కరీబియన్ లీగ్‌ను సైతం వెస్టిండీస్ బోర్డు ముందుకు జరిపింది. మరోవైపు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును బీసీసీఐ ఒప్పించే పనిలో పడిందని సమాచారం. అన్నీ కుదిరితే ఆంగ్లేయులూ క్యాష్ రిచ్ లీగ్ ఆడనున్నారు.


Click it and Unblock the Notifications












