Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ కేప్టెన్ రికీ పాంటింగ్.. ఐపీఎల్‌ను వీడట్లేదు. 2025 సీజన్ నాటికి మళ్లీ ఈ బిగ్గెస్ట్ టోర్నమెంట్‌లో దర్శనం ఇవ్వడం ఖాయమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో మరో కొత్త జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ అవుతున్నాననే విషయాన్ని నిర్ధారించాడు.
మొన్నటి వరకు రికీ పాంటింగ్.. ఢిల్లీ కేపిటల్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే అతన్ని తొలగించింది. అతనితో ఉన్న ఏడు సీజన్ల అనుబంధాన్ని తెంచుకుంది. మరో సీనియర్ ప్లేయర్ కోసం అన్వేషణ సాగిస్తోంది ఢిల్లీ కేపిటల్స్ యాజమాన్యం.

2008లో ఈ ప్రీమియర్ లీగ్ ఆరంభం కాగా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవని జట్లల్లో ఒకటి- ఢిల్లీ కేపిటల్స్. ఆస్ట్రేలియాకు ఐసీసీ వరల్డ్ కప్‌ను అందించిన రికీ పాంటింగ్..ఆ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలను స్వీకరించినా ఆ జట్టు తలరాతలో ఎలాంటి మార్పూ రాలేదు.
2018లో తొలిసారిగా ఢిల్లీ కేపిటల్స్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు రికీ పాంటింగ్. కోచ్‌గా అతని సారథ్యంలో కొన్ని బెస్ట్ సీజన్లను నమోదు చేసుకుంది. 2020 సీజన్‌లో ఫైనల్స్ సైతం చేరుకుంది గానీ.. దురదృష్టవశావత్తూ దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది. ఢిల్లీ కేపిటల్స్ ప్రస్థానంలో ఇదే బెస్ట్ మూమెంట్.
ఈ సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది డీసీ. ఆడిన మొత్తం 14 మ్యాచ్‌లల్లో ఏడింట్లో విజయాలను అందుకుంది. లీగ్స్ ముగిసే సమయానికి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. రికీ పాంటింగ్ స్థానంలో ఢిల్లీ కేపిటల్స్ ఎవరిని హెడ్ కోచ్‌గా అపాయింట్ చేస్తుందనేది ఇంకా వెల్లడి కాలేదు.
అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, గ్యారీ కిర్‌స్టెన్, గ్రెగ్ షెప్పర్డ్, ప్యాడీ అప్టాన్.. హెడ్ కోచ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ ప్లేయర్‌ను తీసుకోవాలనుకుంటే గ్యారీ కిర్‌స్టెన్, స్వదేశం వైపే మొగ్గు చూపితే రాహుల్ ద్రావిడ్‌కు ఈ అవకాశం దక్కొచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఢిల్లీ వదులుకున్నప్పటికీ.. 2025 సీజన్‌లో మళ్లీ హెడ్ కోచ్‌గా రిటర్న్ అవుతానని రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో కోచ్‌గా పని చేయడం తనకు ఎంతో ఇష్టమనీ పేర్కొన్నాడు. ఈ కారణంతోనే ఇంగ్లాండ్ జట్టుకు వన్డే ఫార్మట్ హెడ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశాన్ని వదులుకున్నానని వివరించాడు.
ఢిల్లీ కేపిటల్స్‌తో ఏడు సీజన్లకు హెడ్ కోచ్‌గా పని చేశానని, దురదృష్టవశాత్తు తాను కోరుకున్న ఫలితం రాలేదని వ్యాఖ్యానించాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్‌కూ కోచ్‌గా వ్యవహరించిన విషయాన్నీ గుర్తు చేశాడు. మెరికల్లాంటి కొత్త క్రికెటర్లను తయారు చేయడానికి ఐపీఎల్‌లో ఎంతో అవకాశం ఉందని అన్నాడు.
ఏ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ అవుతాననే విషయం ఓ రెండు నెలల్లో తేలిపోతుందని రికీ పాంటింగ్ చెప్పాడు. ఆ జట్టు ఏదనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించాడు. హెడ్ కోచ్‌గా రావడం మాత్రం ఖాయమైందనే సంకేతాలను ఇచ్చాడు.
కాగా- కోల్‌కత నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్.. ఫ్రాంఛైజీలు రికీ పాంటింగ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతను ఈ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిపిన డైరెక్టర్ గౌతమ్ గంభీర్.. టీమిండియాకు హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది.
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కార.. ఇంగ్లాండ్ వైట్ బాల్ ఫార్మట్ హెడ్ కోచ్‌గా నియమితుడయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఐపీఎల్ నుంచి సంగక్కార తప్పుకోవచ్చు. అతని స్థానాన్ని రికీ పాంటింగ్‌తో భర్తీ చేయడం ఖాయమౌతుంది. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్ కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ.. దాన్ని రెన్యూవల్ చేయలేదా ఫ్రాంఛైజీ.