ఐపీఎల్-2024 సీజన్‌లో బ్యాటర్లదే హవా. సగం లీగ్ పూర్తికాకముందే రికార్డులు బద్దలవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డులు నమోదవుతున్నాయి. 263 స్కోరు రికార్డును అత్యంత సలువుగా ఈ సీజన్‌లో బ్రేక్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 277, 287 స్కోర్లతో కొత్త చరిత్ర సృష్టించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు కూడా భారీ స్కోర్లు సాధించాయి.
అయితే బ్యాటర్ల విధ్వంసానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ సీజన్‌లో బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్‌గా ఉన్న జట్టే విజేతగా నిలుస్తుందని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. సాధారణంగా అత్యుత్తమ బౌలింగ్ ఉన్న జట్లు ఛాంపియన్‌గా నిలుస్తాయని, కానీ ఈ ఐపీఎల్ సీజన్‌లో బ్యాటర్లదే ఆధిపత్యమని తెలిపాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగా భారీ స్కోరులు నమోదవుతున్నాయని పాంటింగ్ అన్నాడు.

''ఆట ఎక్కడికి వెళ్తుందో అనే ఫీలింగ్ వస్తుంది. దానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టే బాధ్యత వహించాలి. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా. ఈ జట్టు భారీ స్కోర్లు సాధిస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనే దీనికి కారణమవుతుందని భావిస్తున్నా. గత మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌ను చూడండి. తన తర్వాత వచ్చే బ్యాటర్లపై నమ్మకం, జట్టులోని బ్యాటింగ్ ఆర్డర్ లోతుగా ఉంటేనే అలాంటి ఆట ఆడగలరు''
''ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ వంటి పెద్ద టోర్నమెంట్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ డిఫెన్సివ్ జట్లే గెలిచాయి. కానీ ఈ ఐపీఎల్ సీజన్ భిన్నమైన నిబంధనలతో భిన్నంగా సాగుతోంది. తొలుత భారీ స్కోర్లు సాధించి, దాన్ని కాపాడుకునే బౌలర్లు ఉన్న జట్లు గెలుస్తున్నాయి. ఈ సీజన్‌లో డిఫెన్సివ్ బౌలింగ్ కంటే ఎటాకింగ్ బ్యాటింగ్ ఉన్న జట్టే ఐపీఎల్ విజేతగా నిలుస్తుందని భావిస్తున్నా'' అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.
కాగా, రికీ పాంటింగ్ కోచ్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్-15లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ఒక్కరూ కూడా లేరు. బ్యాటింగ్ వైఫల్యంతోనే తాము మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నామని రికీ పాంటింగ్ పరోక్షంగా చెప్పాడు.