|
పాంటింగ్ ఏమన్నాడంటే..
నెట్సెషన్స్లో శ్రమిస్తున్న ఆటగాళ్లను పాంటింగ్ కొనియాడాడు. ‘కుర్రాళ్లందరికి స్వాగతం. ఈ రోజు ఇదే మన ఫస్ట్ ట్రైనింగ్ సెషన్. కొంచెం ఆలస్యమైంది. ఇప్పటికే మీ సన్నాహకాల గురించి ప్రవీణ్, మహ్మద్ కైఫ్‌లతో మాట్లాడాను. నెట్స్‌లో మీరు కష్టపడుతున్న తీరును వారు నాకు చెప్పారు. మీ ప్రిపరేషన్ ఇప్పటి వరకు అద్భుతంగా సాగింది. ఇక్కడ కొంత మంది కుర్రాళ్లకు నా గురించి తెలియకపోవచ్చు. నాది మెల్బోర్న్. వయసు 46 ఏళ్లు. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. గత మూడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా పనిచేస్తున్నాను.

పంత్.. ఇది నీ టీమ్..
నేను బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాది మేం ఆఖరి స్థానంలో నిలిచాం. రెండేళ్ల క్రితం మూడో స్థానంతో సరిపెట్టుకున్నాం. గతేడాది రన్నర్‌గా నిలిచాం. గత సీజన్లలోని జట్టు కన్నా ఈ ఢిల్లీ టీమ్ ప్రత్యేకమైనది. నేను చెప్పేది కరెక్టే కదా? ఫ్రాంచైజీ మిమ్మల్ని తీసుకొచ్చింది నా గురించి కాదు. కోచ్‌ల కోసం కాదు. మీకోసమే. నేను చెప్పేది వాస్తవమేనా? ఇది మీ జట్టు. నయా కెప్టెన్ రిషభ్ పంత్ ఇది నీ టీమ్.

గెలవడానికే వచ్చాం..
ఐపీఎల్ టైటిల్ గెలవడానికి మనం ఓ అడుగు ముందుకు వేస్తున్నాం. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. టైటిల్ గెలిచేందుకే నేను ఇక్కడ ఉన్నాను. గత సీజన్లో దగ్గరగా వచ్చి అవకాశాన్ని చేజార్చుకున్నాం. గత రెండు సీజన్లు మనకు బాగానే గడిచాయి. కానీ గొప్పవి మాత్రం కాదు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. జట్టులో ఏ మీటింగ్ జరిగినా.. వ్యూహాలు రచించినా అన్ని జట్టు విజయం కోసమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క ఆటగాడిని రోజు రోజుకి మెరుగు పర్చడమే నా బాధ్యత. అది నేను సక్రమంగా నిర్వర్తిస్తే హాయిగా నిద్ర పోతా.

నెట్స్‌లో శ్రమించాల్సిందే..
అదే జరిగితే మనం ఎక్కువ మ్యాచ్‌లు గెలవచ్చు. మేం నెట్స్‌లో ఆటగాళ్లను వదిలేయం ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. మాకు పర్ఫెక్ట్ అనిపించేవరకు ప్రాక్టీస్ సెషన్ కొనసాగిస్తాం. అది గంట లేదా, రెండు, మూడు గంటలు కూడా జరగవచ్చు. ఇక నా కోచింగా చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు సరైన అటిట్యూడ్‌తో ముందుకు సాగుతూ.. కమిట్మెంట్తో కష్టపడితే మీతో నేను బాగుంటా. సరేనా? రాబోయే రెండు నెలలు అవే మన టీమ్ విలువలవుతాయి'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. శుక్రవారంతో ఐపీఎెల్ 2021 సీజన్‌కు తెరలేవనుంగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఫస్ట్ మ్యాచ్ శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది.