న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సోమవారం నాడు అభిప్రాయపడ్డాడు. ద్రావిడ్‌కు ఎంతో క్రికెట్ పరిజ్ఞానం, అనుభవం ఉన్నాయని చెప్పారు.
టీమ్ ఇండియా కోచ్ పదవి రేసులో ఉన్న ద్రావిడ్‌కు పలువురు మద్దతిస్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, ముంబై ఇండియన్స్ చీఫ్ కోచ్ పాంటింగ్ కూడా మద్దతుగా నిలిచాడు. ఇప్పటికే ఫ్లెచర్ పదవి కాలం ముగిసి చాలా రోజులు పూర్తయిన నేపథ్యంలో బీసీసీఐ కోచ్ కోసం వేట కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ మాట్లాడాడు. క్రికెట్‌పై ద్రావిడ్‌కున్న పరిజ్ఞానం అద్భుతమన్నాడు. మూడు ఫార్మాట్లలో అతని అపార అనుభవం జట్టుకు బాగా కలిసొస్తుందని చెప్పాడు. అంతేగాక ఈ మధ్య అతను ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడన్నాడు.

భారత క్రికెట్ జట్టుకు సరైన కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు. కానీ బీసీసీఐ తీసుకునే నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఒకవేళ కోచ్ పదవిపై ద్రావిడ్‌కు ఆసక్తి ఉంటే అతను సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తాడని చెప్పాడు.
భారత్ విదేశాల్లో రాణించాలనుకుంటే ద్రావిడ్ లాంటి ఉత్తమమైన వ్యక్తి మరొకరు దొరకరన్నాడు. కోచ్ పదవికి సంబంధించి టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయాలకు బీసీసీఎ ఎక్కువ విలువ ఇచ్చే అవకాశముందని రికీ పాంటింగ్ చెప్పాడు.